సూపర్ స్టార్ కు మళ్ళీ ఇబ్బందే..!!

సూపర్ స్టార్ కు మళ్ళీ ఇబ్బందే..!!

గతంతో పోలిస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ చేసే సినిమాలు అన్ని భారీ బడ్జెట్ లోనే ఉంటున్నాయి.  స్టార్ హీరో కావడంతో తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి దర్శకులు సిద్దపడటం లేదు.  అటు నిర్మాతల ఆలోచన కూడా అలానే ఉంటున్నది.  రజిని మార్కెట్ కు తగినట్టుగా బడ్జెట్ పెడుతున్నారు.  ఒక్కోసారి ఈ బడ్జెట్ పెరిగిపోవడంతో రిలీజ్ తరువాత ఇబ్బందులు వస్తున్నాయి.  చాలామార్లు రజినీకాంత్ డిస్ట్రిబ్యూటర్లకు ఆదుకున్నాడు.  

పెట్ట సినిమా కోలీవుడ్ లో మంచి విజయం సొంతం చేసుకుంది.  టాప్ వసూళ్ళలో అది కూడా ఒకటి.  సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా తెలుగులో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.  కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్టుగా, తెలుగులో రజిని సినిమా ఫెయిల్ కావడానికి కూడా అలాంటి కారణాలే ఉన్నాయి.  సంక్రాంతి సీజన్ కావడంతో... టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.  రజిని టాప్ హీరోనే కానీ తెలుగులో తెలుగు హీరోలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి థియేటర్ల కొరత ఏర్పడింది.  దీంతో అనుకున్నట్టుగా సినిమా వసూళ్లు సాధించలేకపోయింది.  

పేట తరువాత రజినీకాంత్... ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చేస్తున్నాడు.  రీసెంట్ గా ముంబైలో స్టార్ట్ అయ్యింది.  ఫస్ట్ లుక్ పోస్టర్ సగటు అభిమానిని ఆకట్టుకుంది.  దర్బార్ వచ్చే ఏడాది అంటే 2020 సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది.  ఆ సంక్రాంతికి టాలీవుడ్ లో మరో రెండ్ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  అందులో ఒకటి మహేష్ బాబు సినిమా కాగా, రెండో సినిమా సైరా.  

సైరా దసరాకు అనుకుంటున్నా... విఎఫ్ఎక్స్ కారణంగా దసరాకు రిలీజ్ కాకపోవచ్చు అన్నది ఇన్సైడ్ టాక్.  దసరా మిస్సయితే... సంక్రాంతికే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.  మహేష్ బాబు.. అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు నిర్మాత దిల్ రాజు.  వీటితో పాటు మరికొంతమంది హీరోలు సంక్రాంతిని టార్గెట్ చేసుకొని రాబోతున్నారు.  ఇంత పోటీని దర్బార్ సినిమా తట్టుకుంటుందా... తట్టుకొని రిలీజ్ అవుతుందా... ఏమో చూడాలి.