శ్రీశాంత్ పై నిషేధం ఎత్తేసిన సుప్రీం..పునరాలోచించాలని బీసీసీఐకి సూచన

శ్రీశాంత్ పై నిషేధం ఎత్తేసిన సుప్రీం..పునరాలోచించాలని బీసీసీఐకి సూచన

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ కి సుప్రీంకోర్ట్ నుంచి 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసులో కొంత ఊరట లభించింది. శ్రీశాంత్ పై జీవితకాల నిషేధం విధిస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) క్రమశిక్షణ కమిటీ 2013లో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్ట్ రద్దు చేసింది. 

బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ శ్రీశాంత్ పై విధించిన శిక్ష పరిమాణంపై మూడు నెలల్లోగా పునరాలోచించాలని సుప్రీంకోర్ట్ సూచించింది. తనకి వేసిన శిక్ష పరిణామంపై బీసీసీఐ క్రమశిక్షణ సంఘం ఎదుట వాదన వినిపించే అవకాశం శ్రీశాంత్ కి తప్పక ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఎస్. శ్రీశాంత్ పై పెండింగ్ లో ఉన్న నేరారోపణలపై తన ఆదేశాల ప్రభావం ఏ మాత్రం ఉండబోదని సుప్రీంకోర్ట్ తెలిపింది. 

ఐపీఎల్ 2013లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ దోషిగా తేలడంతో బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధం విధించింది. దీనిని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్ట్ లో పిటిషన్ వేశాడు. శ్రీశాంత్ పై అవినీతి, జూదం, క్రీడను అప్రతిష్ట పాల్జేశాడనే ఆరోపణలు ఉన్నట్టు బీసీసీఐ కోర్టుకి తెలిపింది.