పదోన్నతికి 2 జడ్జిలను సిఫార్సు చేసిన సుప్రీంకోర్ట్ కొలీజియం

పదోన్నతికి 2 జడ్జిలను సిఫార్సు చేసిన సుప్రీంకోర్ట్ కొలీజియం

సుప్రీంకోర్ట్ కొలీజియం ఝార్ఖండ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అనిరుద్ధ బోస్, గౌహతి హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏఎస్ బొపన్నలను పదోన్నతికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి సిఫార్సు చేసింది. 'ప్రస్తుతం ఇతర చీఫ్ జస్టిస్ లు, హైకోర్టులలోని సీనియర్ జడ్జిల కంటే వీళ్లిద్దరూ ఎంతో అర్హమైనవారు, అన్ని విధాలుగా తగినవారని కొలీజియం భావిస్తోంది. అందువల్ల వీళ్లను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో జడ్జిలుగా నియమించవచ్చని సిఫార్సు చేస్తోందని' ఒక ప్రకటనలో తెలిపింది. 

జస్టిస్ అనిరుద్ధ బోస్ కలక్తా హైకోర్ట్ జడ్జిగా జనవరి 19, 2004లో నియమితులయ్యారు. 11 ఆగస్ట్ 2018లో ఝార్ఖండ్ చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందారు. అఖిల భారత స్థాయిలో హైకోర్ట్ జడ్జిల సీనియారిటీ జాబితాలో ఆయన 12వ స్థానంలో ఉన్నారు. ఇక జస్టిస్ ఏఎస్ బొపన్న జనవరి 6, 2006న కర్ణాటక హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 29 అక్టోబర్ 2018న గౌహతి హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందారు. అఖిల భారత స్థాయిలో హైకోర్ట్ జడ్జిల సీనియారిటీ వరుస క్రమంలో జస్టిస్ బొపన్న 36 స్థానంలో ఉన్నారు.