మసీదుల్లో మహిళల ప్రవేశంపై పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం !

మసీదుల్లో మహిళల ప్రవేశంపై పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం !

మసీదుల్లో పురుషులతో పాటు నమాజ్ చేసుకోవడానికి మహిళలకు కూడా అనుమతివ్వాలని పుణెకు చెందిన దంపతులు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించింది.  ఈ పిటిషన్‌పై కేంద్రం, జాతీయ మహిళా కమిషన్, సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ముస్లిం మహిళలను మసీదులలోకి అనుమతించకపోవడం, మహిళల ప్రాథమిక హక్కులను కాలరాయడమే అంటూ, అర్టికల్ 14, 15, 21, 25, 29 లను  ఉల్లంఘించడమే అని పిటిషన్ లో పేర్కొన్నారు దంపతులు.  

తాజాగా శబరిమలై కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుంటూ ఈ పిటిన్‌ను  విచారణకు   స్వీకరించామన్నారు జస్టిస్ ఎస్ ఏ బాబ్డే.  పుణేలోని మహ్మదీయ జామా మసీదులో నమాజ్ చేసుకునేందుకు అనుమతివ్వాలని మసీదు పాలక వర్గాన్ని ముస్లిమ్ దంపతులు కోరగా వారి విజ్ఞప్తిని మసీదు పాలక కమిటీ తిరస్కరించింది.  దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ముస్లిమ్ దంపతులు.