నన్ను తొలగించే కుట్ర.. లైంగిక ఆరోపణలపై సీజేఐ..

నన్ను తొలగించే కుట్ర.. లైంగిక ఆరోపణలపై సీజేఐ..

తనపై లైంగిక ఆరోపణలు రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌.. తనపై ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నానన్న ఆయన.. సీజేఐగా నన్ను తొలగించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతోందని ఆరోపించారు. ఇరవై ఏళ్లు నిస్వార్థంగా సేవలందించాని గుర్తుచేసుకున్న ఆయన.. ఒక మాజీ జూనియర్ అసిస్టెంట్ ఈవిధమైన పనిచేస్తుందనుకోవడంలేదన్నారు. ఇలాంటి ఘటనలతో న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదం పొంచి ఉందన్నారు రంజన్ గొగోయ్‌. 

కాగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు రావడం సంచలనమైంది. సీజేఐపై లైంగిక ఆరోపణలకు సంబంధించిన వార్తలను మూడు ప్రముఖ జాతీయస్థాయి వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి. దీంతో అత్యవసరంగా సమావేశమైన సుప్రీంకోర్టు బెంచ్.. సీజేఐపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ప్రత్యేకంగా విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను సీజేఐ రంజన్ గొగోయ్ కొట్టిపారేశారు. నేను ఈ దేశ పౌరులకు ఏ విధంగా చెప్పాలి, ఈ ఆరోపణలు దేశంలోని న్యాయవ్యవస్థ తీవ్రమైన ముప్పుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మహిళ ఆరోపణలు నిరాధారమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కొట్టిపారేశారు. ఆ మహిళకు నేర చరిత్ర ఉందని, ఆమెపై రెండు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్నారు సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా. నేరారోపణలు ఉన్న మహిళ సుప్రీంకోర్టులో సర్వీసులోకి ఎలా వచ్చిందని తుషార్ మెహతా ప్రశ్నించారు.

అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణల చేశారు. దీనిపై నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అఫిడవిట్ పంపించారామె. లైంగిక వేధింపుల కారణంగా గత అక్టోబర్ నుంచి తన‌ కుటుంబం ఇబ్బందులు పడుతుందని ఆవేదన‌ వ్యక్తం చేశారు ఆ మహిళ.