అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంపై రేపే సుప్రీం తీర్పు?

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంపై రేపే సుప్రీం తీర్పు?

అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంపై సుప్రీంకోర్టు రేపు ఉదయం 10.30కి తీర్పు ఇవ్వనుంది. బుధవారం జరిగిన విచారణలో అయోధ్య వివాదాన్ని మధ్యవర్తిత్వానికి పంపవచ్చా వద్దా అనే నిర్ణయంపై సుప్రీంకోర్ట్ తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ కేసులో విభిన్న పక్షాల వాదనలను వింది. ఈ భూ వివాదాన్ని మధ్యవర్తిత్వానికి పంపాలా వద్దా అనే విషయంపై తర్వాత ఆదేశాలు ఇస్తామని బెంచ్ ప్రకటించింది. ఈ విచారణలో నిర్మోహీ అఖాడాతో పాటు ఇతర హిందూ సంస్థలు మధ్యవర్తిత్వానికి పంపాలన్న అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావనను వ్యతిరేకించాయి. ముస్లిం సంస్థలు మాత్రం ఈ ప్రతిపాదనను సమర్థించాయి. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని మూడు పక్షాలు-సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహీ అఖాడా, రామ్ లలా మధ్య సరిసమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏప్రిల్ 14న దాఖలైన అప్పీల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకొనే అవకాశం పరిశీలించాలని సూచించింది.

సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 89 ప్రకారం భూవివాదాలను కోర్టు బయట పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించవచ్చు. న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం భూవివాదాలను పరిష్కరించుకొనేందుకు అన్ని పక్షాల అంగీకారం తప్పనిసరి. ఒకవేళ ఏ పార్టీ అయినా ఈ ఒప్పందానికి ఒప్పుకోకపోతే కోర్టు చాలా కాలంగా పెండింగ్ తో ఉన్న ఈ పిటిషన్ పై విచారణ జరుపుతుంది.