వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై రేపటిలోగా సమాధానం ఇవ్వండి

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై రేపటిలోగా సమాధానం ఇవ్వండి

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపును 50 శాతం మేర లెక్కించడంపై తమ సమాధానాన్ని రేపటిలోగా కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్ట్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 50 శాతం మేర ఓటు రసీదు యంత్రాలను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్ట్ మార్చి 28 సాయంత్రం 4 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని సుప్రీంకోర్ట్ గత విచారణలో ఆదేశించింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఇవాళ తన సమాధానంతో అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో అత్యున్నత న్యాయస్థానం ఈసీకి మరో రోజు గడువును ఇచ్చింది. 

ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా 50 శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలు తీసుకురావాలని 21 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌యాదవ్‌, సతీష్‌ చంద్ర మిశ్రాల నేతృత్వంలో 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్‌ అశోక్‌ లవాసాలకు వినతిపత్రం అందజేశారు. ఈసీ నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.