శబరిమల రివ్యూ పిటిషన్ల మీద సుప్రీం సంచలన నిర్ణయం

శబరిమల రివ్యూ పిటిషన్ల మీద సుప్రీం సంచలన నిర్ణయం

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గతేడాది ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. శబరిమల వ్యవహారం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.  ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ముగ్గురు విస్తృత ధర్మాసనానికి నివేదించాలని తేల్చారు. మెజారిటీ జడ్జిల అభిప్రాయంతో జస్టిస్‌ నారీమన్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌ విభేదించించారు. దీంతో ఈ వివాదం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందుకు శబరిమల వివాదం వెళ్లనుంది. దేశంలో ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ స్పష్టం చేశారు.

శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై  తీర్పు చెబుతూ సీజే ఈ వ్యాఖ్యలు చేశారు.  మతంలో అంతర్గత విషయం ఏమిటనేది తేల్చడమే ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న అంశంగా తెలిపారు.  ఈ కేసు ముస్లిం మహిళలు మసీదుల్లోకి ప్రవేశం అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. సమీక్ష పిటిషన్ తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని, మతంలో అంతర్గత భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని పిటిషనర్లు కోరారని తెలిపింది. మతపరమైన విశ్వాసాలను తక్కువ చేయడం తగదని అభిప్రాయపడింది.