స్థానికసంస్థల ఎన్నికలకు బ్రేక్..! స్టే విధించిన సుప్రీంకోర్టు..

స్థానికసంస్థల ఎన్నికలకు బ్రేక్..! స్టే విధించిన సుప్రీంకోర్టు..

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్, అన్ని పార్టీలు సిద్ధమవుతోన్న సమయంలో... స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కర్నూలుజిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి, ఆనంతపురంజిల్లాకు చెందిన బీసీ రామాంజనేయుల పిటిషన్లు దాఖలు చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీవో 176ను రద్దు చేయాలని, ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలో చేర్చిన 9, 15, 152, 153, 180, 181వ సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని కొట్టివేయాలని పిటిషన్లు వాదించారు. ఈ పిటిషన్లలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, కమిషనర్‌, డైరెక్టర్‌, అనంతపురంజిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారిని ప్రతిపాదులుగా చేర్చారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం స్థానిక సంస్థల నిర్వహణపై స్టే విధించింది.