కోర్టు ధిక్కారం కేసులో షిల్లాంగ్ టైమ్స్ కి సుప్రీం ఊరట

కోర్టు ధిక్కారం కేసులో షిల్లాంగ్ టైమ్స్ కి సుప్రీం ఊరట

షిల్లాంగ్ టైమ్స్ ఎడిటర్, పబ్లిషర్లపై కోర్టు ధిక్కారం కింద మేఘాలయ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్ట్ శుక్రవారం స్టే ఇచ్చింది. వార్తాపత్రిక ఎడిటర్, పబ్లిషర్ దాఖలు చేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ హైకోర్ట్ రిజిస్ట్రార్ కు నోటీసులు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రముఖ దినపత్రికైన షిల్లాంగ్ టైమ్స్ ఎడిటర్, పబ్లిషర్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మేఘాలయ హైకోర్ట్ ఈ నెల ఆరంభంలో నిర్ధారించింది. వారిపై చెరో రూ.2 లక్ష జరిమానా విధించింది. వారంలోగా వారు జరిమానా చెల్లించలేకపోతే వారిద్దరికీ ఆర్నెల్ల జైలు శిక్ష, వార్తాపత్రికపై నిషేధం విధిస్తామని చెప్పింది. 

ద షిల్లాంగ్ టైమ్స్ 1945లో ప్రచురణ ప్రారంభించింది. ఈశాన్య రాష్ట్రాలలో ఇది చాలాకాలంగా ప్రచురితమవుతున్న ఆంగ్ల దినపత్రికలలో ఒకటి. ఎడిటర్ పాట్రీషియా ముఖిమ్, పబ్లిషర్ శోభా చౌదరీలు నిర్వహిస్తున్న ద షిల్లాంగ్ టైమ్స్ లో గత ఏడాది డిసెంబర్ 6, 10న ప్రచురించిన రెండు వార్తా కథనాలు కోర్టు ధిక్కారంగా మేఘాలయ హైకోర్ట్ పరిగణించింది. రిటైరైన జడ్జిలు, వారి కుటుంబాలకు మెరుగైన వసతులు కల్పిస్తూ ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను విమర్శిస్తూ ఆ కథనాలు ఉన్నాయి.

హైకోర్ట్ ఉత్తర్వులను ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది. ఇది భయపెట్టే చర్య అని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను ఖండిస్తూ గిల్డ్ 'జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష విధిస్తామని, పత్రికపై నిషేధం విధిస్తామన్న బెదిరింపులు భయపెట్టే చర్యలని.. ఇది పత్రికా స్వేచ్ఛను హరించేవిగా ఉన్నాయని' చెప్పింది. 'పత్రికా స్వేచ్ఛను నిలబెట్టాల్సిన న్యాయస్థానాలు భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఉత్తర్వులు జారీ చేయడం విషాదమని' తెలిపింది. 'రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను అత్యంత జాగరూకతతో ఉపయోగించి ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు తగిన గౌరవం దక్కేలా చూడాలని' న్యాయవ్యవస్థను కోరింది.