పంకజా ముండేకి సుప్రీం షాక్

పంకజా ముండేకి సుప్రీం షాక్

మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్ పెద్ద షాక్ ఇచ్చింది. మహిళ, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండే మంజూరు చేసిన రూ.6,300 కోట్ల ఆహార ఒప్పందాలను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కాంట్రాక్టులు 2016లో ఇవ్వడం జరిగింది. ఆంగన్ వాడీలలో పోషకాహారం అందించేందుకు ఈ కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ కాంట్రాక్టులు ఇచ్చేందుకు నియమాలను తుంగలో తొక్కినట్టు సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల డివిజన్ బెంచ్ ఫిబ్రవరి 26న ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్ట్ తాజా తీర్పు రానున్న ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టనుందని భావిస్తున్నారు.

మహిళా పొదుపు సంఘాలను కాదని బడా కాంట్రాక్టర్లకు రూ.6,300 కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అన్ని నియమాలు ఉల్లంఘించినందువల్ల ఆ కాంట్రాక్టులు రద్దు చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ శాసనసభలో ప్రతిపక్ష నేత ధనంజయ్ ముండే మంత్రి పంకజ్ ముండే గురించి ఈ విధంగా ట్వీట్ చేశారు. మూడేళ్ల క్రితం తాను అభ్యంతరం వ్యక్తం చేసిన అంశాలనే సుప్రీంకోర్ట్ తన తీర్పులో పేర్కొనడం ద్వారా తాను పేర్కొన్న అన్ని సమస్యలను కోర్టు కూడా ఆమోదించినట్టయిందని ధనంజయ్ ముండే అన్నారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖ కోర్టు ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిందని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. ‘నేను ఆరోపించినపుడు తప్పు అన్న ప్రభుత్వం, ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని కూడా తప్పు అంటుందా?‘ అని ధనంజయ్ ముండే ప్రశ్నించారు. 2016లో పంకజా ముండే ‘రెడీ టు ఈట్‘ అనే పథకాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు ప్రభుత్వ భోజన పథకాన్ని నిర్వహిస్తున్న మహిళా పొదుపు సంఘాల నుంచి న్యూట్రిషన్ డైట్ కాంట్రాక్ట్ ను ఉపసంహరించారు. రాబోయే 4 వారాల్లో రెడీ టు ఈట్ కింద ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఫిబ్రవరి 26న ఆదేశించింది.