ఎన్నికల సంఘంపై సుప్రీం ఆగ్రహం

ఎన్నికల సంఘంపై సుప్రీం ఆగ్రహం

తనకు విస్తృత అధికారాలున్నా.. ఉపయోగించడం లేదన్న ఆరోపణలపై స్పందించాల్సిందిగా సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అభ్యర్థులు ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం  కఠిన చర్యలు తీసుకోవడం లేదని పిటీషనర్‌ వాదించారు. దీనికి స్పందిస్తూ ఎన్నికల సంఘం న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మతం ఆధారంగా మాయావతి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. ఆమెకు నోటీసు జారీ చేశామని, ఈ నెల 12కల్లా ఆమె సమాధానం పంపాల్సిందని, కాని ఆమె నుంచి ఇంకా సమాధానం రాలేదని ఎన్నికల సంఘం లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. మరి మీరు ఏం చేయదలిచారంటూ కోర్టు ప్రశ్నించగా...  పార్టీ  గుర్తింపు తాము రద్దు చేయలేమని, అలాగే ఆమెను అనర్హురాలిగా ప్రకటించలేమని.. కేవలం సూచనలు సలహాలు ఇవ్వడమే తమ పని అని చెప్పారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు... దీనిపై సమగ్ర విచారణ చేస్తామని రేపు ఉదయం మళ్ళీ కేసు విచారిస్తామని పేర్కొంది.