ఆర్థికంగా బలహీనవర్గాల కోటా పిటిషన్లపై మే 2న విచారణ

ఆర్థికంగా బలహీనవర్గాల కోటా పిటిషన్లపై మే 2న విచారణ

అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యుఎస్) ఉద్యోగాలలో 10 శాతం కోటాను ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్ట్ మే 2న చేపట్టనుంది. ఈడబ్ల్యుఎస్ కి 10 శాతం కోటా కేటాయించడం వల్ల అంతకు ముందు సుప్రీంకోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులలో రిజర్వేషన్ పై 50 శాతం పరిమితిని దాటుతోందని పిటిషనర్లు తెలిపారు.

ఒకసారి 10 శాతం కోటా కింద ఉద్యోగ నియామకాలు జరిపితే ఆ తర్వాత వాటిని ఉపసంహరించడం కష్టమని సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ సోమవారం చేసిన వాదనతో అంగీకరించిన జస్టిస్ ఎస్ ఏ బోబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్ ల బెంచ్ అర్జీల విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత 10 శాతం కోటా ఇస్తూ రాజ్యాంగంలోని 103వ సవరణను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుందో దాని ప్రకారం అన్ని నియామకాలు జరుగుతాయని జస్టిస్ బోబ్డే చెప్పారని ధావన్ అన్నారు.

ప్రతివాదుల వాదనలను వ్యతిరేకిస్తూ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ఇంతకు ముందు ఫిబ్రవరి, మార్చిలలో ఈ అభ్యర్థనలను తిరస్కరించడం జరిగిందని గుర్తు చేశారు. దానికి ఆ సమయానికి ఆ అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది తప్ప పూర్తిగా కొట్టిపారేయలేదని ధావన్ జవాబు ఇచ్చారు.