ధోనితో పాటు రైనా కూడా...

ధోనితో పాటు రైనా కూడా...

ఈ రోజు 74 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారు భారత ప్రజలు. అయితే ఈ రోజు ఆ సంతోషంతో ముగుస్తుంది అని అనుకున్న వారందరికి షాక్ ఇచ్చారు భారత ఆటగాళ్లు మహేంద్రసింగ్ ధోని అలాగే సురేష్ రైనా. భారత మాజీ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్ కు తన వీడ్కోలు పలికి కొద్దిసేపటికే భారత ఆటగాళ్లలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన సురేష్ రైనా కూడా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2005 జులై 30 న శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రైనా 15 ఏళ్ళ పాటు భారత జట్టుకు తన సేవలు అందించాడు. ఇక రెండు సంవత్సరాల క్రితం 2018 లో జులై లో ఇంగ్లాండ్ తో జరిగిన టీ 20, వన్డే సిరీస్ లో చివరిసారిగా భారత్ తరపున ఆడాడు. తన అంతర్జాతీయ కెరియర్ లో మొత్తం 18 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన రైనా  768 పరుగులు చేసి 13 వికెట్లు, 226 వన్డే లో 5,615 పరుగులు, 36 వికెట్లు, 78 టీ 20 ల్లో 1,605 పరుగులు 13 వికెట్లు తీసుకున్నాడు. అలాగే తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ లో మొత్తం 167 క్యాచ్చులు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం రైనా కూడా ధోనితో పాటుగా ఐపీఎల్ 2020 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం లో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ లో సిఎస్కే తరపున ఎన్నో సీజన్ ల నుండి ఆడుతున్నారు. ఆటగాళ్లుగా మాత్రమే కాకుండా వీరిద్దరూ మంచి మిత్రులు కూడా. ఒక్కే రోజు కలిసి అంతర్జాతీయ క్రికెట్ కు పలికిన వీడ్కోలే వారి స్నేహానికి గుర్తు.