రాయుడు అవుట్.. రైనా ఇన్

రాయుడు అవుట్.. రైనా ఇన్

దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్‌ సురేష్‌ రైనాకు మళ్లీ వన్డే జట్టులో చోటు లభించింది. కీలక ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత సెలక్టర్లు అంబటి రాయుడు స్థానంలో సురేష్ రైనాను ఎంపిక చేశారు. ఐపీఎల్‌-11 సీజన్‌లో చెన్నై జట్టు తరపున అద్భుతంగా రాణించిన రాయుడుకు ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించారు. అయితే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఈ నెల 15న నిర్వహించిన యోయో టెస్టులో విఫలమయ్యాడు. ఈ విషయమై బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాయుడు స్థానంను స్టార్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనాతో భర్తీ చేశారు. దీంతో రైనాకు అనూహ్యంగా ఇంగ్లండ్‌లో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో అవకాశం లభించింది.

చివరిసారిగా రైనా 2015 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో ముంబైలో జరిగిన వన్డేలో ఆడాడు. తర్వాత జట్టులో కొత్త కుర్రాళ్ళు రావడం.. అదే సమయంలో రైనా ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు రైనాకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు రాయుడు చివరిసారిగా జూన్ 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో ఆడాడు. ఇక భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మకు ఆదివారం ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ-20లు ఆడనుంది.

జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సురేశ్ రైనా, ధోనీ, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, ఉమేశ్ యాదవ్.