సర్జికల్ స్ట్రైక్ హీరో లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడాపై తీవ్ర ఆరోపణలు

సర్జికల్ స్ట్రైక్ హీరో లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడాపై తీవ్ర ఆరోపణలు

జాతీయ భద్రతకు సంబంధించి మంగళవారం ఓ వివాదం వెలుగు చూసింది. భారత సైన్యాన్ని సరైన పరిమాణానికి తీసుకొచ్చే నివేదికలోని వివరాలను లీక్ చేశారని సర్జికల్ స్ట్రైక్ హీరో లెప్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డీఎస్ హుడాపై జాతీయ భద్రతా సలహా మండలి (ఎన్ఎస్ఏబీ) చైర్ పర్సన్ తీవ్ర ఆరోపణలు చేశారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్ గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా ఉరి ఉగ్రవాద దాడి తర్వాత 2016లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కి ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐసీడబ్ల్యుఏ) ఏర్పాటు చేసిన 'జాతీయ భద్రతా సంస్థలు: సవాళ్లను ఎదుర్కోవడం' అనే అంశంపై ప్రసంగిస్తూ ఎన్ఎస్ఏబీ చైర్ పర్సన్ పీఎస్ రాఘవన్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) హూడాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ఎస్ఏబీ కోసం నివేదిక తయారుచేసిన హూడా ఒప్పందం షరతులను ఉల్లంఘించి రిపోర్ట్ వివరాలను లీక్ చేశారని తెలిపారు. 'మేం లెఫ్టినెంట్ జనరల్ హూడాను నివేదిక తయారుచేయమని కోరాం. ఆయన దానిని బహిర్గత పరచి ఒప్పందం షరతులను ఉల్లంఘించారు. ఆయన అలా చేయకూడదు. నాకిచ్చిన నివేదికపై ఆయన సీక్రెట్ అని రాస్తారు. దానికి 1,2,3 కాపీలు రాస్తారు. ఆ తర్వాత పక్కనే ఉన్న మానెక్ సా సెంటర్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ నివేదికలో తాను ఇవి పేర్కొన్నానని చెబుతారని' పీఎస్ రాఘవన్ అన్నారు.

కాంగ్రెస్ కోసం లెప్టినెంట్ జనరల్ హూడా తయారుచేసిన టాస్క్ ఫోర్స్ నివేదికకి సంబంధించిన ప్రశ్నకి సమాధానంగా ఎన్ఎస్ఏబీ చైర్ పర్సన్ హూడాపై నిప్పులు చెరిగారు. అత్యంత రహస్య పత్రాల్లోని వివరాలను లెఫ్టినెంట్ జనరల్ హూడా బహిర్గత పరిచారని ఆరోపించారు. అయితే హూడా, రాఘవన్ ఆరోపణలను కొట్టిపారేశారు. తాను ఈ రిపోర్ట్ లోని వివరాలను తెలిపేందుకు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తనకు గుర్తు రావడం లేదన్నారు. 'ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు. మానెక్ సా సెంటర్ లో ఎలాంటి సెమినార్ జరగలేదు. అందులో నేను ఎన్ఎస్ఏబీకి ఇచ్చిన రిపోర్ట్ పై మాట్లాడిందీ లేదు. ఎవరైనా కనీసం ఒక్క వ్యక్తి నేను ఆ సెమినార్ లో రహస్య వివరాలను బయట పెట్టినట్టు చెబితే నేను తప్పు చేసినట్టు అంగీకరిస్తాను. లేదంటే రాఘవన్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని' లెఫ్టినెంట్ జనరల్ హూడా సవాల్ చేశారు.

గత ఏడాది భారత సైన్యం తగిన పరిమాణం గురించి ఒక నివేదిక తయారు చేయాలని ఎన్ఎస్ఏబీ లెప్టినెంట్ జనరల్ డీఎస్ హూడాను కోరింది. హూడా తన రిపోర్టును ఎన్ఎస్ఏబీ ఏకసభ్య ప్యానెల్ కు 2018 నవంబర్ చివరన అందజేశారు. ఈ ఏడాది మార్చిలో లెఫ్టినెంట్ జనరల్ హూడా జాతీయ భద్రతాపై పూర్తిస్థాయి నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇచ్చారు.