ఆస్కార్ పోరులో సూర్య సినిమా

ఆస్కార్ పోరులో సూర్య సినిమా

హీరో సూర్యకి ఉన్న ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంటాడు. ప్రేక్షకులకు ప్రతిసారి కొత్తతరహా కథను పరిచయం చేసేందుకు తాపత్రయ పడుతుంటాడు. తన కెరీర్‌లో గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమవుతున్న సూర్య ఆకాశం నీ హద్దురా సినిమా భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆస్కార్ రేస్‌లో పాల్గొననుందట. దీంతో కాలీవుడ్‌లో సూర్య అబిమానులను సంబరాలు చేసుకుంటున్నారు. కాకపోతే  ఈసినిమా తమిళ వెర్షన్ ఈ ఆస్కార్ పోటీలో పాల్గొంటుంది. తమిళ్‌లో సోరారై పోట్రు అనే పేరుతో విడుదలైంది. దీని తెలుగు అనువాదమే ఆకాశమే నీహద్దురాగా వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో అత్యుత్తమ నటుడు, అత్యత్తమ నటి, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌లతో పాటు మరికొన్ని కేటగిరీల్లో కూడా ఈ సినిమా పోటీ పడుతోంది. నేడు ఈ సినిమాను అకాడమీ స్క్రీనింగ్ వారు వీక్షించనున్నారట. ఈ వార్తను రాజశేఖర్ పాండియన్ తన ట్విటర్ ద్వారా తెలిపారు. ‘గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ఆదరించిన సూరారై పోట్రు ఆస్కార్ రేసులో పాల్గొంటుంది. అన్ని రకాల కేటగిరీల్లో ఈ సినిమా పోటీ పడుతుంది. నేడు అకాడమీ స్క్రీనింగ్‌ వారు ఈ చిత్రాన్ని వీక్షించనున్నార’ని రాసుకొచ్చాడు. ఈ వార్త వెలువడిన అతి తక్కువ సమయంలోనే సూర్య అభిమానులు దీనిని ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేసి, సినిమా టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.