ఆస్ట్రేలియా టూర్‌కు అత‌న్ని తీసుకోవాల్సింది: లారా

ఆస్ట్రేలియా టూర్‌కు అత‌న్ని తీసుకోవాల్సింది: లారా

వెస్టిండీస్ మాజీ దిగ్గ‌జ క్రికెట‌ర్ బ్రియాన్ లారా.. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయాల్సింద‌ని అభిప్రాయపడ్డాడు. అత‌డో క్లాస్ ప్లేయ‌ర్‌. నేను కేవ‌లం ప‌రుగులు మాత్ర‌మే చేసే ప్లేయ‌ర్స్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోను. వాళ్ల టెక్నిక్‌, ఒత్తిడిలో ఆడే సామ‌ర్థ్యం, వాళ్లు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నారో కూడా చూస్తాను. ఆ లెక్క‌న ముంబై త‌ర‌ఫున సూర్య‌కుమార్ అద్భుతంగా ఆడాడు అని లారా ప్ర‌శంస‌లు కురిపించాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 77 మ్యాచ్‌లు ఆడిన సూర్య‌కుమార్ 44 స‌గ‌టుతో 5326 ప‌రుగులు, 165 టీ20ల్లో 32.33 స‌గ‌టుతో 3492 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబై త‌ర‌ఫున కీల‌క ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. అత‌డి ఫామ్ చూసిన వాళ్లంతా ఆస్ట్రేలియా టూర్‌కు కచ్చితంగా ఎంపిక అవుతాడ‌ని భావించారు. అయితే సెల‌క్ట‌ర్లు మాత్రం అత‌నికి మొండిచేయి చూపించారు. అలాంటి క్లాస్ ప్లేయ‌ర్ క‌చ్చితంగా ఆస్ట్రేలియా టూర్‌కు ఉండాల్సింద‌ని లారా కూడా అంటున్నాడు.