శ్రీలంక పేలుళ్లలో 10 మంది భారతీయులు మృతి

శ్రీలంక పేలుళ్లలో 10 మంది భారతీయులు మృతి

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో భారత మృతుల సంఖ్య 10కి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం తెలిపారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరుకుంది. ఈ ఘటనలో దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. సోమ‌వారం రాత్రి నుంచి శ్రీలంక‌లో ఎమ‌ర్జెన్సీ అమ‌లులోకి వ‌చ్చింది. ఇప్పటి వ‌ర‌కు పోలీసులు ఉగ్ర ఘ‌ట‌న‌కు సంబంధించి 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ జాతీయ సంతాప దినాన్ని పాటిస్తున్నారు. బాంబు పేలుళ్ల ఘ‌ట‌న‌లో విచార‌ణ‌కు స‌హ‌క‌రించేందుకు ఇంట‌ర్‌పోల్ ఓ టీమ్‌ను శ్రీలంక‌కు పంపించింది. షాంగ్రిలా హోట‌ల్‌లో ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తిని ఇన్‌సాన్ సీలావ‌న్‌గా గుర్తించారు. అవిస‌వెల్లా-వెల్లంపిటియా రోడ్డులో అత‌నికి ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ప‌నిచేస్తున్న 9 మంది ఉద్యోగుల‌ను పోలీసులు విచార‌ణ నిమిత్తం అరెస్టు చేశారు. సూసైడ్ బాంబ‌ర్‌కు ఇత‌ర కిల్లర్స్‌తో లింకులు ఉండి ఉంటాయ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.