తెలంగాణ పీసిసి చీఫ్ మార్పు ఇంకెప్పుడు ?

తెలంగాణ పీసిసి చీఫ్ మార్పు ఇంకెప్పుడు ?

తెలంగాణ PCC చీఫ్ మార్పు ముహూర్తం కుదరడం లేదు. దీంతో ఆశావహులకు నిరాశే ఎదురౌతోంది. ఏడాది కాలంగా తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడి మార్పు ఖాయమనే టాక్‌ నడుస్తున్నా... ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారనుకుంటే... అదీ జరగలేదు. AICC అధ్యక్ష బాధ్యతల్ని రాహుల్‌ గాంధీ చేపడతారని... వెంటనే టీ-పీసీసీకి కొత్త నాయకుడ్ని నియమిస్తారని ఓ వర్గం భావించింది. కానీ... CWC సమావేశంలో గందరగోళంతో అధ్యక్ష పదవిలో మరో ఆరు నెలల పాటు కొనసాగేందుకు సోనియా గాంధీ అంగీకరించారు.  
 
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో చాలా కాలంగా కొనసాగుతున్నాం కనుక అధినాయకత్వం చేస్తే... కీలక పదవులు తమకేనంటూ చెప్పుకున్నారు కొందరు నేతలు. కానీ... ఇప్పుడు AICCలోనే పరిస్థితి బాలేదు. దీంతో ఇప్పట్లో PCCల్లో మార్పులు-చేర్పులు జరిగే సూచనలు కనిపించడం లేదు. మరో ఆరు నెలల పాటు తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. మరోవైపు... గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు... ఖమ్మం, వరంగల్ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు పూర్తయ్యే వరకు PCCలో మార్పులు- చేర్పులు ఉండకపోవచ్చనే చర్చ నడుస్తోంది. AICC అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగినంత కాలం... ఉత్తమ్‌కి డోకా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే... ఉత్తమ్ వ్యతిరేక శిబిరం మాత్రం... ఇప్పటికీ PCC మార్పుపై ఆశలు వదులుకోడానికి సిద్ధంగా లేదు. మరి తెలంగాణ PCCలో మార్పులు జరుగుతాయో? లేదో చూడాలి.