మహారాష్ట్ర సంక్షోభం.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ..!

మహారాష్ట్ర సంక్షోభం.. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ..!

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటవుతుందా..? అయితే అది ఎప్పుడు జరుగుతుంది...? ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు..? ముఖ్యమంత్రి అయ్యేదెవరు..? ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారా...? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకడం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు గడిచినా ప్రభుత్వం ఏర్పాటుకాని సంక్షోభ పరిస్థితులు మహారాష్ట్రలో నెలకొన్నాయి.. రెండు మిత్ర పక్షాలు బీజేపీ -శివసేన మధ్య ముఖ్యమంత్రి పదవి విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత అసెంబ్లీ గడువు రేపటితో ముగుస్తుంది.. ఈ లోపు ప్రభుత్వం ఏర్పాటుకాకపోతే రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలి. అయితే రాష్ట్రపతి పాలన విధించే విషయంలో గవర్నర్ కోషియారీ న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను పిలిచి మాట్లాడారు. ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని ఆపద్ధర్మంగా కొనసాగించడమా... లేక రాష్ట్రపతి పాలన విధించడమా అన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరికొన్ని రోజులు గడువు ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్‌నే  ఆపద్ధర్మ సీఎంగా కొనసాగించే ఆలోచన కూడా చేస్తున్నారు.

ముఖ్యమంత్రి పీఠాన్ని రొటేషన్ పద్ధతిలో పంచుకోవాలన్న విషయంలో తన వైఖరిని శివసేన ఇప్పటికీ మార్చుకోలేదు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా సీఎం పదవిని రెండు పార్టీలు పంచుకోవాల్సిందేనని పట్టుపడుతోంది.. ఎన్నికలకు ముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోని బీజేపీ... తమ ఎమ్మెల్యేలకు వలవేసి శివసేనను చీల్చే కుట్ర చేస్తోందని విమర్శిస్తోంది. ఉద్ధవ్ థాక్రేతో సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ  ముంబైలోని హోటల్‌కు తరలించారు. ఎవరూ చేజారిపోకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టింది శివసేన.