'బాబు పదవి ఇస్తా అన్నా.. వైసీపీలో చేరా'

'బాబు పదవి ఇస్తా అన్నా.. వైసీపీలో చేరా'

కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు పదవి ఇస్తాను అన్నా.. వద్దని వైసీపీలో చేరాను. టీడీపీ నుంచి వైసీపీకి రావడం సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందన్నారు. జగన్‌ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, పార్టీ మారి తామే అన్యాయం చేశామన్నారు. టీడీపీ వాళ్ళు మోసం చేశారు. చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. కర్నూలులో వైసీపీ అభ్యర్థి హఫీజ్‌ ఖాన్‌ను గెలిపించుకుంటాం. ఏపీలో వైఎస్‌ జగన్‌ను సీఎం చేసుకుంటామని మోహన్‌ రెడ్డి తెలిపారు.

కర్నూలులో తన సత్తా ఏంటో చూపిస్తానని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్‌ కుటుంబాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు. వాళ్లు ఎంతమంది ఉన్నా భయపడేది లేదు, తమపై కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అప్పట్లో పార్టీ మారానే కానీ.. డబ్బులు, పదవులు కోసం కాదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వైఎస్‌ జగన్‌కు బహుమతి ఇస్తామని ఎస్వీ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.