టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ తెగించారా?

టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ తెగించారా?

టీఆర్ఎస్ నేత స్వామిగౌడ్ తెగించారా? గులాబి పార్టీలో భవిష్యత్ లేదని డిసైడ్ అయ్యారా? ఇంతకీ స్వామిగౌడ్ ఏం ఆశించారు.. ఏం దక్కలేదు? ఆయన ప్రయాణం ఏటు వైపు?  తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు స్వామిగౌడ్. నాడు జేఏసీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2012 జులైలో పదవి విరమణ చేసిన తర్వాత టీఆర్‌ఎస్‌ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2013 ఫిబ్రవరిలో కరీంనగర్ గ్రాడ్యుయేట్‌  MLC నియెజకవర్గం నుంచి పోటి చేసి గెలిచారు స్వామిగౌడ్. ఆపై తెలంగాణ ఏర్పాటు కావడం.. టీఆర్ఎస్‌ అధికారంలోకి రావడంతో.. తెలంగాణ శాసనమండలికి తొలి చైర్మన్‌ అయ్యారాయన. 

రాజేంద్రనగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి ఆసక్తి.. చేవెళ్ల ఎంపీ టికెట్‌ అడిగినా నిరాశే!

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన స్వామిగౌడ్ మండలి చైర్మన్ అయ్యాక నోరు కట్టేసుకోవాల్సి వచ్చింది. ఇదే అభిప్రాయాన్ని పలు సందర్భాలలో ఆయన సన్నిహితుల దగ్గర చెప్పేవారు. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. కానీ.. ఆయనకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం స్వామిగౌడ్‌ దగ్గర ఎలాంటి పదవీ లేదు. 2019 మార్చిలోనే ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిపోయింది. అసెంబ్లీ టికెట్‌ ఇవ్వకపోయినా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించి.. చేవెళ్ల టికెట్‌ అడిగారు. అప్పుడు కూడా పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. అప్పటి నుంచి మౌనంగా ఉండిపోయిన స్వామిగౌడ్‌.. ఎక్కడా పెదవి విప్పింది లేదు. 
 
టీఎన్‌జీవో అధ్యక్షుడిగా గతంలో ఆరోపణలు!

టీఎన్‌జీవో ప్రెసిడెంట్‌గా స్వామిగౌడ్‌ ఉన్న సమయంలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో విచారణ కూడా జరిగింది.  ఆ  తర్వాత అతీగతీ లేదు. మరోవైపు- ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ చట్ట సభలో అడుగుపెట్టేందుకు  తీవ్రంగా ప్రయత్నించారు స్వామిగౌడ్‌. సీఎం కేసీఆర్‌ను కలిసే ప్రయత్నం చేసినా సక్సెస్‌ కాలేకపోయారన్న ప్రచారం ఉంది. మంత్రి కేటీఆర్‌ను మాత్రం కలిసి తన మనసులో మాట చెప్పారట స్వామిగౌడ్‌. మరి.. కేటీఆర్‌ ఏం చెప్పారో ఏమో కానీ.. ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడా  మాట్లాడింది లేదు. 

టీఆర్‌ఎస్‌లో భవిష్యత్‌ లేదని అనుకుంటున్నారా? 

చేతిలో పదవి లేకపోవడం.. తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో  టీఆర్‌ఎస్‌లో తనకు భవిష్యత్‌ లేదనే నిర్ధారణకు స్వామిగౌడ్‌ వచ్చినట్లు చెబుతున్నారు. ఇటీవల ఆయన చేసిన కామెంట్స్‌ దీనికి బలం చేకూరుస్తున్నాయి.  నారాయణగురు జయంతి వేడుకల్లో పాల్గొన్న స్వామిగౌడ్‌.. దేశంలో కొన్ని కులాలే పరిపాలిస్తున్నాయని.. ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ హాట్‌ చర్చకు దారితీస్తున్నాయి. స్వామిగౌడ్‌ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో అదే వేదికపై టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ కూడా ఉన్నారు. అది కాక సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ నేపధ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు శత్రువుగా భావించే రేవంత్ రెడ్డిని పొగడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

తన వ్యాఖ్యల ద్వారా ఎటువంటి సంకేతాలు పంపుతున్నారు?

ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం రాకపోగా.. శాసనమండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో తన పేరు పరిశీలనలో లేదన్న సంకేతాలు.. స్వామిగౌడ్‌ అలా మాట్లాడటానికి కారణమై ఉండొచ్చన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. మొత్తానికి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న స్వామిగౌడ్‌.. ఇప్పుడిలా సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీకి ఎటువంటి సంకేతాలు పంపాలనుకుంటున్నారో తెలియాల్సి ఉంది.  పార్టీలో ఈ విధంగా బీసీ వాయిస్‌ వినిపించడం ఇది కొత్త కాదు. గతంలో మంత్రి ఈటల రాజేందర్‌ కూడా మాట్లాడారు.  కాకపోతే.. స్వామిగౌడ్‌ స్పందించిన తీరు.. సమయం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టీఆర్‌ఎస్‌ లో తనకు అవకాశాలు రాకపోవచ్చునని భావించే.. రాజకీయ భవిష్యత్‌ దిశగా స్వామిగౌడ్‌ అడుగులు వేస్తున్నారని.. అందుకే ఈ స్థాయిలో బయటపడ్డారని అనుకుంటున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.