విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి

విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర సరస్వతి

విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ (కిరణ్‌ బాలస్వామి) బాధ్యతలు స్వీకరించారు. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం కృష్ణానదీ తీరాన ఉన్న గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో కన్నులపండువగా నిర్వహించారు. కిరణ్ కుమార్ శర్మకు ఆయన గురువైన స్వరూపానందేంద్ర సరస్వతి సన్యాస దీక్షను అనుగ్రహించారు. సన్యాస దీక్షా నామధేయం ‘స్వాత్మానందేంద్ర సరస్వతి’ అని అనుగ్రహించారు. సన్యాస దీక్ష పొందగానే ఉత్తరాధికారి తన గురువు స్వరూపానందేంద్ర సరస్వతికి పాదుకాపూజతో పాటు పుష్పాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అన్ని ప్రముఖ దేవస్థానాల నుంచి వేద పండితులు తరలివచ్చి తీర్థప్రసాదాలను అందచేశారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి తదితర ప్రముఖులు హాజరయ్యారు. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి కిరణ్‌కుమార్‌ శర్మలకు ఇరువురు సీఎంలు వైఎస్‌ జగన్‌, కేసీఆర్‌ ఫలపుష్పాలు సమర్పించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. స్వాత్మానందేంద్ర సరస్వతికి ఇరు రాష్ట్రాల సీఎంలు కిరీటధారణ చేశారు. సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవంలో భాగంగా మూడు రోజులుగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో కృష్ణ తీరంలో యాగ, హోమ, దాన, పూజాదికాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, వేదపండితులు శాస్త్రోక్తంగా కిరణ్‌కుమార్‌ శర్మ సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం జరిపారు.