సీపీఎస్ ఉద్యోగులకు తీపికబురు 

సీపీఎస్ ఉద్యోగులకు తీపికబురు 

తెలంగాణలో సీపీఎస్‌ కింద ఉన్న 1.32 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ పదవీ విరమణ(రిటైర్మెంట్‌), మరణానంతర(డెత్‌) గ్రాట్యుటీ వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ ఫలాలు ఆశావహులకు అందనున్నాయి. సీఎం కేసీఆర్‌ ఈ మధ్య ఇచ్చిన హామీకి అనుగుణంగా 2004 సెప్టెంబరు 1 నుంచే అమల్లోకి తీసుకొస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1న, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం సీపీఎస్‌ అమలు చేసింది. వీరందరికీ 2004 సెప్టెంబరు 1 నుంచే సీపీఎస్‌ వర్తిస్తుందంటూ 2004 సెప్టెంబరు 22 ఆర్థికశాఖ జీవో నెం.663ను జారీ చేసింది. సీపీఎస్‌ కింద ఉన్న ఉద్యోగులను తెలంగాణ స్టేట్‌ రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌- 1980 నుంచి తొలగించింది. వారంతా గ్రాట్యుటీ ప్రయోజనాలకు అర్హులు కారని స్పష్టం చేసింది. కానీ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు వర్తింపజేస్తున్న సెంట్రల్‌ సివిల్‌ సర్వీ్‌స(పెన్షన్స్‌) రూల్స్‌-1972 మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదవీవిరమణ, మరణానంతర గ్రాట్యుటీలను వర్తింపజేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2016 ఆగస్టు 26న ఉత్తర్వులు జారీ చేసింది. అదే మాదిరిగా రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులకూ రిటైర్మెంట్‌, డెత్‌ గ్రాట్యుటీలను అమలుచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి.

ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ గ్రాట్యుటీ జీవోను జారీ చేసింది. రాష్ట్రంలోని సీపీఎస్‌ ఉద్యోగులందరికీ తెలంగాణస్టేట్‌ రివైజ్డ్‌పెన్షన్‌ రూల్స్‌-1980ను వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ గ్రాట్యుటీ చెల్లింపులో రూ.12లక్షల పరిమితి ఉంది. ఉద్యోగి పదవీవిరమణ చేసిననాటికి ఉన్న మూలవేతనానికి అప్పటికే అమల్లో ఉన్న కరువు భత్యాన్ని కలుపుతారు. ఈ మొత్తానికి 16.50రెట్ల సొమ్మును గ్రాట్యుటీ కింద చెల్లిస్తారు. ఈ మొత్తం రూ.12లక్షలకు మించి ఉండరాదు. రూ.12లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ సొమ్మునే చెల్లిస్తారు. రూ.12లక్షలకు మించితే రూ.12లక్షలు మాత్రమే చెల్లిస్తారు. పూర్తికాలం సర్వీసుచేసిన వారికే ఈ రూ.12లక్షల సీలింగ్‌ వర్తిస్తుంది. సర్వీసు మధ్యలో చనిపోతే వారి కుటుంబసభ్యులకు సర్వీసు కాలం దామాషాలో మరణానంతర గ్రాట్యుటీని అందిస్తారు.