రూ.5 లక్షలు పలికిన అర్జున్ టెండూల్కర్

రూ.5 లక్షలు పలికిన అర్జున్ టెండూల్కర్

దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను టీ20 ముంబై లీగ్ రెండో సీజన్ కోసం ఆకాష్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్ శనివారం రూ.5 లక్షలకు కొనుగోలు చేసింది. సచిన్ ఈ లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. సుజీత్ నాయక్ ను కూడా రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. వేలంలో అర్జున్ ని ఆల్ రౌండర్ కేటగిరీలో రూ.లక్ష బేస్ ప్రైస్ తో చేర్చడం జరిగింది.

ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలరైన అర్జున్ భారత్ అండర్-19 జట్టు తరఫున అనధికార టెస్ట్ ఆడాడు. చాలా జట్లు అతని కోసం వేలం పాడాయి. కానీ నార్త్ ముంబై పాంథర్స్ రూ.5 లక్షల అత్యధిక వేలం పాడింది. ఆ తర్వాత వేలంపాట నిర్వహించిన చారూ శర్మ రెండు కొత్త జట్లు-ఆకాష్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్, ఈగల్ ఠాణే స్ట్రైకర్స్ కి సరిసమానమైన అవకాశం (ఓటీఎం) ప్రత్యామ్నాయం ఇచ్చారు.

రెండు జట్లు ఓటీఎం ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నాయి. ఇందులో ఒక బ్యాగ్ లో రెండు కార్డులు పెట్టారు. ముంబై క్రికెట్ సంఘం తాత్కాలిక కమిటీ సభ్యుడు ఉన్మేష్ ఖాన్విల్కర్ ఒక కార్డు ఎంపిక చేశారు. అది ఆకాష్ టైగర్స్ ది కావడంతో ఆ యాజమాన్యం జూనియర్ టెండూల్కర్ ను పొందగలిగింది. లీగ్ మే 14 నుంచి వాంఖేడే స్టేడియంలో ప్రారంభమవుతుంది.