నా డబ్బు తీసుకోండి, జెట్ ఎయిర్వేస్ రక్షించండి:మాల్యా

నా డబ్బు తీసుకోండి, జెట్ ఎయిర్వేస్ రక్షించండి:మాల్యా

జెట్ ఎయిర్వేస్ కి ఉపశమన ప్యాకేజీ ఇచ్చి ప్రభుత్వ బ్యాంకులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని పరారీలో ఉన్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత మోడీ ప్రభుత్వంపై కూడా మాల్యా విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నో ట్వీట్లు చేసిన విజయ్ మాల్యా 'నేను బ్యాంకుల బకాయిలు తీర్చేందుకు హైకోర్టు ఎదుట నా చరాస్తులు పెట్టాను. ఆ డబ్బుని బ్యాంకులు ఎందుకు తీసుకోవడం లేదు? దీంతో కనీసం జెట్ ఎయిర్వేస్ ని రక్షించేంత మొత్తం వస్తుందని' పేర్కొన్నారు. 

ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ ని రక్షించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకులు కంపెనీ నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత మాల్యా ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నో ట్వీట్లు చేశారు. 'కింగ్ ఫిషర్ కోసం కూడా ఇలాంటిదేదో చేయాలని నేను కోరుకున్నాను. ఉద్యోగాలు, కనెక్టివిటీ, కంపెనీని రక్షించడం కోసం జెట్ ఎయిర్వేస్ కి ప్రభుత్వ రంగ బ్యాంకులు సాయపడటం చూసి సంతోషం వేసిందని' ట్వీట్ లో రాశారు.

'ఇవే బ్యాంకులు మెరుగైన ఉద్యోగులు, కనెక్టివిటీ కలిగిన దేశంలోనే అత్యుత్తమ ఎయిర్ లైన్స్ విషయంలో అలా చేయలేదు. దానిని సర్వనాశనానికి వదిలేశారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాల వైఖరికి నిదర్శనం. నేను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, దాని ఉద్యోగులను రక్షించేందుకు కంపెనీలో రూ.4000 కోట్ల పెట్టుబడులు పెట్టాను' అని ట్వీట్ లో పేర్కొన్నారు. కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో వేర్వేరుగా ప్రవర్తించినందుకు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. 

'అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి నేను రాసిన లేఖలను బీజేపీ ప్రతినిధి మీడియాకి చదివి వినిపించారు. యుపిఏ ప్రభుత్వంలో ప్రభుత్వ బ్యాంకులు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కి అడ్డగోలుగా సాయపడ్డాయని ఆరోపించారు. ప్రస్తుత ప్రధానమంత్రికి లేఖ రాసేలా నన్ను మీడియా రెచ్చగొట్టింది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఏ మార్పు వచ్చిందో నాకు అర్థం కావడం లేదని' మరో ట్వీట్ లో పేర్కొన్నారు.