తమిళనాడు సునామీ మృతులకు నివాళులు 

తమిళనాడు సునామీ మృతులకు నివాళులు 

తమిళనాడు, పొరుగున ఉన్న పుదుచ్చేరి రాష్ట్రాల ప్రజలు 2004 సునామీ మృతులను బుధవారం సంస్మరించుకున్నారు. తమ ఆప్తులను రాకాసి అలలు అమాంతంగా మింగేసి 14 ఏళ్లయిన సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంత ప్రజలు సముద్రం దగ్గర నివాళులర్పించారు. తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్ చెన్నైలో, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి సునామీ మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడులోని చెన్నై, కడలూరు, నాగపట్టినం, ఇతర జిల్లాల్లో సంస్మరణ సభలు నిర్వహించి మృతుల ఆత్మశాంతికి ప్రార్థనలు చేశారు. మౌనంగా ప్రదర్శనలు జరిపారు. చాలా ప్రాంతాల్లో పుష్పాంజలి ఘటించారు. 

14 ఏళ్ల క్రితం ఆదివారం నాడు ఆకాశం అంత ఎత్తున ఎగిసిపడిన అలలు తమవారిని ఎలా మింగేశాయో గుర్తుచేసుకొని వారి బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. చెన్నై, కడలూరులలో వివిధ మత్స్యకార సంఘాల సభ్యులు, మృతుల బంధువులు పూలదండలు సముద్రంలోకి విసిరి పాలు పోసి మరణించిన ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. కరైకల్, నాగపట్టినం జిల్లాల్లోని 64 మత్స్యకార గ్రామాల ప్రజలు క్యాండిల్ ప్రదర్శనలు జరిపి పుష్పాంజలి ఘటించాయి.

ఉదయం సరిగ్గా 9.17 నిమిషాలకు అంతా లేచి నిలబడి మృతుల ఆత్మలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఓ నిమిషం మౌనం పాటించారు. 2004లో వచ్చిన సునామీలో నాగపట్టినంలో 6,065 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలోని సుమత్రాకి పశ్చిమ తీరం కేంద్రంగా 9.1 నమోదైన భారీ భూకంపం కారణంగా సునామీ విరుచుకుపడింది. డిసెంబర్ 26, 2004లో వచ్చిన జలప్రళయం 14 దేశాల్లోని దాదాపు 2,30,000కి పైగా ప్రాణాలు బలి తీసుకుంది. భారత్ లో 18,000 మందికి పైగా చనిపోయారు.