కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు క్యూ కడుతూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జోరుగా వలసలు కొనసాగినా.. ఆ తర్వాత కొంత కాలం పరిస్థితి మామూలుగానే ఉంది. అయితే, తాజాగా, మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పి.. గులాబీ కారు ఎక్కుతారనే ప్రచారం సాగుతోంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బె చెప్పబోతున్నారు.. ఇప్పటికే ఆయన టీఆర్ఎస్ అగ్రనేతతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే, ఒకటి రెండు రోజుల్లో పార్టీలో చేరే విషయం చెబుతానని రోహిత్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన సన్నిహితులు ధృవీకరిస్తున్నారు. మరోవైపు కాసేపట్లో రోహిత్ రెడ్డి ప్రగత్‌ భవన్‌కి వెళ్తారని సమాచారం. ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అవుతారని.. పార్టీలో చేరికపై చర్చలు జరుపుతారని తెలుస్తోంది. మొత్తానికి మరికొన్ని గంటల్లో ఆయన టీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ రానుంది. మరోవైపు మరో ఒక్కరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కారెక్కుతారని తెలుస్తోంది. భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్యతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ గూటికి చేరుతారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా.. మరో ముగ్గురు కారెక్కితే.. మిగిలేది ముగ్గురు, నలుగురేనా? అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇక, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మరోసీటు కాంగ్రెస్‌ పార్టీకి తగ్గిపోనుంది.