ప్రజల డబ్బుతో జెట్ ఎయిర్ వేస్ ని రక్షిస్తారా?

ప్రజల డబ్బుతో జెట్ ఎయిర్ వేస్ ని రక్షిస్తారా?

పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ ని రక్షించేందుకు ప్రజల డబ్బు వినియోగిస్తారా? అని మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. పాక్షికంగా విదేశీ పెట్టుబడిదారుల యాజమాన్యంలోని జెట్ ఎయిర్వేస్ కి ఉద్దీపన పథకం ప్రకటించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని కాంగ్రెస్ బుధవారం విమర్శించింది.

సంస్థలో రూ.1కి వాటా తీసుకొని జెట్ ఎయిర్వేస్ విమానయాన సంస్థకు ఉన్న రూ.8,500 కోట్ల రుణాలను రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లకు మోడీ ప్రభుత్వం సూచించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ఆరోపించారు.

'లండన్ ప్రవాస భారతీయుడు (ఎన్నారై) అయిన నరేష్ గోయల్ కు జెట్ ఎయిర్వేస్ లో 51 శాతం వాటాలు ఉండగా ఎతిహాద్ ఎయిర్వేస్ కి 24 శాతం వాటా ఉంది. అంటే 75 శాతం యాజమాన్యం ఒక ఎన్నారై, విదేశీ కంపెనీ దగ్గరే ఉందని' సూర్జేవాలా అన్నారు. 'విదేశీ పెట్టుబడిదారుల యాజమాన్యంలోని దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ వంటి కార్పొరేట్ కి మోడీ ప్రభుత్వం ఎందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇస్తోంది? అది కూడా ప్రజాధనంతో. దేశంలోని రుణభారంతో కుంగిపోతున్న రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని' ప్రశ్నించారు.

'ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను రూ.1 వాటాగా మార్చి రుణం రద్దు చేయాల్సిందిగా సూచించింది. అంతే కాకుండా ప్రతి షేర్ కి రూ.150 చొప్పున ఎతిహాద్ కి చెల్లించనుంది. మోడీ ప్రభుత్వం రుణాలు చెల్లించలేని ప్రతి ఆశ్రిత పెట్టుబడిదారుడిని ప్రజాధనంతో రక్షిస్తుందా?' అని సూర్జేవాలా నిలదీశారు.