గుడ్‌న్యూస్‌.. 40 వేల కొత్త‌ ఉద్యోగాలు..

గుడ్‌న్యూస్‌.. 40 వేల కొత్త‌ ఉద్యోగాలు..

ఇది క‌రోనా స‌మ‌యం.. ఉన్న ఉపాధియే పోతోంది.. ఉద్యోగుల‌పై కూడా దెబ్బ‌ప‌డింది.. కొన్ని ఉద్యోగాలు ఊడిపోగా.. మ‌రికొంత‌మంది.. ఉద్యోగాల‌కు రాజీనామా చేసి.. సొంత ప్రాంతాల‌కు వెళ్లిపోయిన ప‌రిస్థితి. ఇక‌, చిన్న కంపెనీలు కొన్ని మూత‌ప‌డిపోయాయి.. పెద్ద కంపెనీలను సైతం క‌రోనావైర‌స్ దెబ్బ‌కొట్టింది.. ఈ స‌మ‌యంలో.. ఉన్న ఉద్యోగాల‌కే గ్యారంటీ లేక‌పోగా.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మాత్రం భారీగా ఉద్యోగాల భర్తీకి పూనుకొంది.. కరోనాతో ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితులనెదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో... నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 40 వేల మందికి కొత్తగా ఉద్యోగాలను కల్పించబోతున్నట్లు ప్ర‌క‌టించింది ఐటీ దిగ్గ‌జం టీసీఎస్. 

ఇక‌, ఈ 40 వేల ఉద్యోగాలు క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉంటాయని ప్ర‌క‌టించింది.. గత త్రైమాసికంలో సంస్థ ఆదాయం తగ్గినప్పటికీ... నియామకాలను తగ్గించుకోబోద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు టీసీఎస్ ప్ర‌తినిధులు.. అంతేకాదు.. అమెరికాలో  కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ పెంచాలని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. ఈ ఏడాదిలో యూఎస్‌లో 2 వేల మందిని నియమించుకోవాలని నిర్ణయించింది. దీని మూలంగా హెచ్ 1 బీ, ఎల్ 1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తోంది టీసీఎస్‌.. ఇక‌, భార‌త్‌లో అయితే.. 40 వేల ఉద్యోగాలు లేదా 35 వేల నుంచి 45 వేల మ‌ధ్య ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నారు. కీలకమైన వ్యాపారం కోసం కొత్త వాళ్ల‌తో పాటు అనుభవజ్ఞులైన నిపుణులను కూడా నియ‌మించ‌నున్నారు.