అంచనాలు మించిన టీసీఎస్‌ ఫలితాలు

అంచనాలు మించిన టీసీఎస్‌ ఫలితాలు

మనదేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చింది. ఈ మూడు నెలల్లో కంపెనీ రెండంకెల వృద్ధిరేటు సాధించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ రూ.38,010 కోట్ల ఆదాయంపై రూ. 8,126 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 12.7 శాతం పెరిగింది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను కంపెనీ నమోదు చేసింది. వరసగా అయిదో త్రైమాసికంలో కంపెనీ రెండంకెల వృద్ధిరేటు సాధించింది. గడచిన 15 త్రైమాసికాల్లోకెల్లా ఈ త్రైమాసిక పనితీరు అత్యంత గొప్పదని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ గోపినాథన్‌ అన్నారు. ఈసారి కంపెనీ ఆదాయంలో బ్రిటన్‌ నుంచి ఆదాయం 21.3 శాతం, యూరప్‌ నుంచి 17.5 శాతం పెరగ్గా అమెరికా ఆదాయం 9.9 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ పనితీరుపై మార్కెట్‌లో అనుమానాలు ఉండటంతో షేర్‌ 0.26 శాతం తగ్గి రూ. 2013 వద్ద ముగిసింది.