జగన్‌..మోడీ.. ఓ క్విడ్ ప్రో కో!!!

జగన్‌..మోడీ.. ఓ క్విడ్ ప్రో కో!!!

సరిగ్గా ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్ లోని 11 ఎకరాలకు పైగా భూమి విషయానికి సంబంధించిన టీడీపీ సంచలన విషయాన్ని తాజాగా మరోసారి గుర్తు చేసింది. మోడీతో జగన్ క్విడ్ ప్రో కో అయ్యారని, అందువల్లే దీనిపై రెండేళ్ల కిందటే ఈడీ సీబీఐకి లేఖ రాసినా బయటకు రాలేదని ఆరోపించింది. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసినా జగన్ అధికార బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఏపీ సర్కార్‌, టీడీపీలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ చెందిన నేతలు ఇప్పుడు దానికి రుజువుగా 2017 మే 31న జగన్ ఆస్తుల వ్యవహారంలో అవినీతి చాలా భారీస్థాయిలో జరిగిందని..ఆ క్విడ్‌ ప్రో కో కేసుని లోతుగా దర్యాప్తు చేసి త్వరగా నివేదిక ఇస్తే దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని అప్పుడు ఈడీ చీఫ్‌గా ఉన్న కర్ణాల్‌ సింగ్‌ అప్పటి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మకు రాసిన లేఖను చూపిస్తున్నారు.

ఈ కేసుల్లో రూ.46,500 కోట్లకు సంబంధించిన ఆస్తులు, పెట్టుబడులపై సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఐతే ఇందులో మరిన్నో అక్రమాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా జరిపిన దర్యాప్తులో రెండు ‘క్విడ్‌ ప్రో కో’లు బయటపడినట్లు ఈడీ తెలిపింది. హిందూజా గ్రూప్‌ కంపెనీకి చెందిన గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఐడీఎల్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌లకు చెందిన 100 ఎకరాల స్థలం ఇండస్ర్టియల్‌ జోన్‌లో ఉంది. దీన్ని వైఎస్‌ ప్రభుత్వ హయాంలో రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చారు. అలాగే విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం పాలవలసలోని హిందూజా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటికి క్విడ్ ప్రో కోగా జగన్‌కు చెందిన కంపెనీకి 11.10ఎకరాలను హిందూజా సంస్థ కట్టబెట్టినట్లు ఈడీ గుర్తించింది. అప్పట్లోనే దీని మార్కెట్‌ విలువ రూ.177.60కోట్లుగా తెలిపింది. 

మరోవైపు ‘ఇందూ’ శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డికి చెందిన మ్యాక్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థకు హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో ఐటీ విధానం కింద 2005 అక్టోబరు 13న 2.25ఎకరాలు కేటాయించారు. ఆ సంస్థ రిజిస్ర్టేషన్‌ కాకుండానే ఇది జరిగింది. ఆ తర్వాత 2 నెలలకు రిజిస్టరైన ఈ కంపెనీ ప్రభుత్వాన్ని మళ్లీ భూమి అడిగిందే తడవుగా 2006లో మరో 3.725ఎకరాలు ఇచ్చేసింది. ఆ భూమిని రూ.10 ముఖ విలువగల 10వేల వాటాలను ఐర్లాండ్‌కు చెందిన క్వీన్‌ లాడ్జింగ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.104 కోట్లకు విక్రయించింది. అదే ఐర్లాండ్‌ కంపెనీ నుంచి శ్యాంప్రసాద్‌రెడ్డి క్వీన్‌సిటీ నిర్మాణానికి రూ.180కోట్లు పొందారు. శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఇందూ టెక్‌జోన్‌, ఇందూ ప్రాజెక్ట్సు-ఏపీ హౌసింగ్‌ బోర్డు ప్రాజెక్టుల్లో క్విడ్‌ ప్రో కో కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. విలువైన భూమి పొంది, డబ్బు చేతులు మారడానికి కీలకంగా మారిన మ్యాక్‌ సొల్యూషన్స్‌ క్విడ్‌ ప్రో కోపై సీబీఐ చార్జిషీట్‌లో లేదు. 

కొత్త అవినీతి మూలాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో సీబీఐ తన చార్జిషీటులో పేర్కొన్న 73మంది వ్యక్తులు, సంస్థలపై మళ్లీ విచారణ జరిపించాలని ఈడీ సీబీఐని కోరింది. సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో 73 మందిని నిందితులుగా పేర్కొని 28 మంది, సంస్థల విషయంలో క్విడ్‌ ప్రో కో జరిగిందనే వాదనలతో ఈడీ ఏకీభవించలేదు. సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్న అభియోగాలనే గుర్తుచేస్తూ ఇది నిజం కాదా అని ప్రశ్నించింది ఈడీ. ఈ క్విడ్‌ ప్రో కో కేసులో ఎన్నో లోతులున్నాయి. ఈ సాక్ష్యాల ఆధారంగా మళ్లీ సమగ్రంగా విచారించి త్వరగా నివేదిక ఇస్తే చర్యలు తీసుకుంటామంటూ ఈడీ కోరి రెండేళ్లు గడిచినా.. సీబీఐ ఈ కేసుని పట్టించుకోలేదు. ఇదంతా చూస్తుంటే జగన్‌ను తమ గుప్పిట్లో ఉంచుకొనేందుకు కేంద్రం దీనిని వాడుకుంటే.. జగన్‌ మోడీకి దాసోహమయ్యారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.