ఎన్నికల ఫలితాలపై సబ్బంహరి అంచనా..

ఎన్నికల ఫలితాలపై సబ్బంహరి అంచనా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని గుర్తించారన్నారు మాజీ ఎంపీ, భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరి... విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మహిళలు టీడీపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారని.. మొదట్లో కొంతమంది యువత పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ వైపు మొగ్గు చూపినా.. కానీ, చివరి దశకు వచ్చేసరికి టీడీపీకే మద్దతు తెలిపారని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన సబ్బంహరి.. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది.. దానిని తెలుగు ప్రజలకు వివరించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని.. అందుకే దక్షిణ భారతదేశంలో బీజేపీకి డిపాజిట్లు రావడం కష్టమేనని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఇప్పుడు టీడీపీకి పది సీట్లు పెరిగే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి 100కిపైగా సీట్లలో టీడీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందరూ 120 - 150 సీట్లు టీడీపీకి వస్తాయంటున్నారు.. కానీ, 90 నుంచి 100 సీట్లు వస్తాయి.. ఇంకా పెరిగే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని చెప్పారు సబ్బం హరి. మరోవైపు వైసీపీకి గతంలో వచ్చిన దానికంటే ఇప్పుడు 20 సీట్ల వరకూ తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ చంద్రబాబుకు పట్టం కట్టబోతున్నారని, ఇది చారిత్రక అవసరమని అంతా గ్రహించారని అన్నారు. 

ఇక ఏపీలో టీడీపీ గెలుపునకు చంద్రబాబే కారణం అన్నారు సబ్బం హరి.. భీమిలిలో నేను గెలిచినా దానికి కూడా కారణం చంద్రబాబేనన్న మాజీ ఎంపీ.. ఎన్నికల్లో ధన ప్రవాహానికి నేను వ్యతిరేకమని స్పష్టం చేశారు. నాకు తెలియకుండానే పార్టీ నా గెలుపుకు ఎంతో కృషి చేసిందన్న సబ్బం హరి.. పోలింగ్ నిర్వహణలో ఎన్నికల అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు. ఈవీఎంల మొరాయింపు ఓటర్లను తీవ్ర   అసహనానికి గురిచేసిందని.. ఒక అసెంబ్లీ అభ్యర్థిగా నేను కూడా ఓటు వేయడానికి 45 నిమిషాలకు పైగా క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కానీ, ప్రతిపక్ష నాయకుడు జగన్ పోలింగ్ బాగా జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు సబ్బం హరి.