స్ట్రెచర్‌పై తిరుగుతూ ప్రచారం..!

స్ట్రెచర్‌పై తిరుగుతూ ప్రచారం..!

ఎన్నికల బరిలోకి దిగాడు..! అంతలోనే అనుకోని ఘటనతో శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది..! ఓ వైపు ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడింది..! నడవలేని పరిస్థితి.. గాయం వేధిస్తోంది.. మరోవైపు ఎండలు మండుతున్నాయి.. అయినా, పట్టుదలతో ప్రచారానికి పునుకున్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి. స్ట్రెచర్‌తోనే ప్రచార వాహనాన్ని ఎక్కాడు... స్ట్రెచర్‌పై పడుకుని.. కన్నీటి పర్యంతమవుతూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తన నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసిన తిక్కారెడ్డి... ప్రచారంలో భాగంగా మంత్రాలయం మండలం ఖగ్గల్లు వెళ్లారు. అయితే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది... స్థానికులను చెదరగొట్టే ప్రయత్నంలో గాల్లోకి కాల్పులు జరిపారు తిక్కారెడ్డి గన్‌మన్‌.. ఈ ఘటనలో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్‌ గాయమై కుప్పకూలారు. దీంతో ఆస్పత్రి పాలయ్యారు తిక్కారెడ్డి.. ప్రత్యేక అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై వచ్చి నామినేషన్‌ సమర్పించిన ఆయన... ఇప్పుడు ప్రచార పర్వానికి తెరపడనుండడంతో తన భార్య వెంకటేశ్వరమ్మతో కలిసి ప్రధాన గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు.