ఓటమిపై కుండబద్దలు కొట్టిన తెలుగు తమ్ముళ్లు

ఓటమిపై కుండబద్దలు కొట్టిన తెలుగు తమ్ముళ్లు

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం కారణాలపై టీడీపీ తమ్ముళ్లు అధినేత చంద్రబాబు ముందు కుండబద్దలు కొట్టారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పులపై పలువురు నేతలు గళమెత్తారు. ఓటమికి గల కారణాలపై విజయవాడలో టీడీపీ అంతర్గత సమావేశం నిర్వహించింది.  కేంద్రస్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు జరిగిన పొరపాట్లను చంద్రబాబుకు వివరించారు. వేల మందితో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లను ఆ పార్టీ నేత అశోక్ గజపతిరాజు తప్పు పట్టారు. వేల మందితో టెలీకాన్ఫరెన్స్‌ల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో హ్యూమన్ టచ్ పోయిందని మరో నేత జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు బాగా దూరమయ్యారని జూపూడి అన్నారు. కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు దూరమయ్యారని.. పార్టీ నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాన్ని పెద్దలు గుర్తించలేదని తెలిపారు. 

ఆర్టీజీఎస్‌ నివేదికలే కొంప ముంచాయని ఎమ్మెల్సీ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. కోడెల కుటుంబం అక్రమాలపై జనం ఎన్నికల సమయంలోనే ప్రస్తావించారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి తెలిపారు. గ్రామ స్థాయిలో నేతల అవినీతిపై బాబుకు చెప్పే అవకాశమే లేకుండా చేశారని, చంద్రబాబు చుట్టూ చేరిన బృందం వాస్తవాలు తెలియకుండా చేశారని దివ్యవాణీ వాపోయింది. విభేదాలు వీడి కలిసి ముందుకు సాగుతామని అనంత జిల్లా నేతలు అన్నారు. ఇప్పుడు కలిసి లేకపోతే మరింత నష్టం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. పార్టీలో న్యాయ విభాగం పటిష్ట పరచాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సూచించారు. వైసీపీ తమపై పెడుతున్న కేసులపై చర్చకు లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని కోరారు.