157 కోట్ల నష్టం చేసి 58 కోట్ల ఆదా అని బడాయి కబుర్లు !

157 కోట్ల నష్టం చేసి 58 కోట్ల ఆదా అని బడాయి కబుర్లు !

రివర్స్ టెండర్లపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఫైట్ మొదలైంది. రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్ అని ప్రభుత్వం అంటుంటే అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంటోంది ప్రతిపక్షం. కావాల్సిన వాళ్లకు.. కట్టబెట్టేందుకే రివర్స్ పేరుతో కాంట్రాక్టులు రిజర్వ్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తుతోంది టీడీపీ. గత ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో రివర్స్ టెండర్లకు వెళ్తామని ప్రకటించిన జగన్ సర్కారు.. పోలవరంతో వాటికి శ్రీకారం చుట్టుంది. లెఫ్ట్ కెనాల్ లింక్ టెన్నెల్, నావిగేషన్ టెన్నెల్ పనులకు నిర్వహించిన రివర్స్ టెండర్లలో 58 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది టీడీపీ.

2005లో కాంగ్రెస్ ప్రభుత్వం 115 కోట్ల రూపాయలకు కాంట్రాక్టు ఇస్తే... 14 ఏళ్లు అయినా పని పూర్తి చేయలేకపోయారని అన్నారు సాగునీటి శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా. అప్పట్లో ఇంటర్నల్ బెంచ్ మార్క్ కంటే 15 శాతం తక్కువకు టెండర్ దక్కించుకున్న ఆ సంస్థ నామ మాత్రంగా కూడా పని చేయలేదని అన్నారు ఉమా. అప్పుడు పనులు చేయించకుండా 157 కోట్లు నష్టం చేసి ఇప్పుడు అదే పనిని 232 కోట్లకు అప్పగించారని రూ.157 కోట్లు నష్టం చేసి రూ.58 కోట్లు ఆదా అయ్యాయని బడాయి కబుర్లు చెబుతున్నారని ఉమ మండిపడ్డారు. హద్దూ పద్దూ లేకుండా పెంచుకుంటూ పోతున్న అంచనాలకు కళ్లెం వేసుందుకు పూర్తి పారదర్శకతతో రివర్స్ టెండర్లు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ధీమాతో ఉంది. ఒక్క పోలవరమే కాదు... గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కాంట్రాక్టులో రివర్స్ టెండర్లకు వెళ్తామని బల్లగుద్ది చెబుతోంది ప్రభుత్వం.