'కేసీఆర్‌కు కవిత ఓడిపోతుందనే భయం..!?'

'కేసీఆర్‌కు కవిత ఓడిపోతుందనే భయం..!?'

సార్వత్రిక ఎన్నికల్లో నిజమాబాద్‌ నుంచి పోటీలో ఉన్న తన కూతురు కవిత ఓడిపోతుందనే భయం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పట్టుకుంది.. అందుకే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని ఆరోపించారు టీడీపీ తెలంగాణ అధ్యక్షులు ఎల్. రమణ... ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండ ఉండేందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్యేలను చేర్చుకుని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు రమణ.. టీడీపీని భూస్థాపితం చేయడం కేసీఆర్ వల్ల కాదన్న ఆయన.. దోచుకున్న సొమ్ముతో మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ గెలిచారని విమర్శించారు. మరోవైపు కేసీఆర్ తెలంగాణకు కాదు జగన్‌కు కాపలా కుక్క అంటూ ఎద్దేవా చేశారు. 

మా పార్టీ నేతలకు టికెట్లు ఎందుకిచ్చారు..?
విపక్షాలకు అభ్యర్థులే లేరన్న కేసీఆర్... మరి మా పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుని టిక్కెట్లు ఎందుకు ఇస్తున్నారంటూ మండిపడ్డారు రావుల చంద్రశేఖర్ రెడ్డి... ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నారని.. ఏపీలో జగన్ గెలుపు కోసం మోడీ, కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రోజు కేసీఆర్ కు డైలీ రిపోర్ట్ ఇస్తున్నారని ఆరోపించిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి... సీఎం కేసీఆర్ వెళ్లి ఏపీలో ప్రచారం చేయాలి.. కానీ, ఇక్కడ ఉండి మాట్లాడటం ఏంటి? అని ఎద్దేవా చేశారు.