పంచాయతీకి ఎక్కువ... మండలానికి తక్కువ...

పంచాయతీకి ఎక్కువ... మండలానికి తక్కువ...

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ వరదరాజులు రెడ్డి... ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సీఎం రమేష్... కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. పంచాయతీకి ఎక్కువ...! మండలానికి తక్కువ అయిన సీఎం రమేష్... పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దయతో రాజ్యసభకు ఎన్నికయ్యారంటూ విమర్శించారు. వర్గ రాజకీయాలతో పార్టీలో చిచ్చుపెట్టడమే కాకుండా... అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం రమేష్... బద్వేల్‌లో ఓ గ్రూప్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, పోడూరు, రాజంపేట... ఇలా అన్ని ఏరియాల్లో గ్రూపులు ఏర్పాటు చేసుకుని రెచ్చగొడుతున్నారని ఆరోపించిన వరదరాజులు రెడ్డి... జిల్లాలో గురించి నీకు ఎందుకు? పార్టీ అధినేత చంద్రబాబు... పార్టీ ఇంఛార్జ్‌లను పెట్టారు, జిల్లా అధ్యక్షుడిని పెట్టారు.... నీకు గ్రూపులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? గుంపులను రెచ్చగొట్టాల్సిన పనేంటి? పార్టీని నాశనం చేయడానికే నీకు రాజ్యసభ సీటు ఇచ్చారా అంటూ సీఎం రమేష్‌పై మండిపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని నీకు ఇక్కడి రాజకీయాలతో పనేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు వరదరాజులు రెడ్డి.