కోడెల మృతి: ఏపీ సర్కార్‌పై కేసు పెట్టాలి..!

కోడెల మృతి: ఏపీ సర్కార్‌పై కేసు పెట్టాలి..!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో మొదట ఏపీ సర్కార్‌పై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.. కోడెలను మొదటి నుంచి కేసులు పెట్టి వేధించారన్న ఆయన.. రోజుకో కేసుపెట్టి టార్చర్‌ చేశారని.. కోడెలపై, ఆయన కుమారుడిపై కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా...! ఉరివేసుకునేలా..! ఉసిగొల్పారని ఆరోపించారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి.. తల నొప్పిగా ఉందని కాసేపు రెస్ట్ తీసుకుంటానని ఇంట్లో ఉన్న కుమార్తెతో చెప్పి మేడమీదకు వెళ్లిన కోడెల శివప్రసాద్ రూమ్ లోకి వెళ్లి బోల్ట్ వేసుకున్నారనీ.. తరువాత ఆయన తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అన్నారు. కోడెల పడుకునేందుకు ఎప్పుడు రూమ్ లోకి వెళ్లినా.. డోర్‌కు బోల్ట్ వేసుకోరనీ.. కానీ, ఇవాళ మాత్రం లోపలికి వెళ్లి బోల్ట్ వేసుకోవటం చూసిన సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి డోర్ కొట్టారు. అయినా కోడెల తలుపు తీయలేదు. దీంతో మరింత అనుమానం వచ్చిన సెక్యూరిటీ రూమ్ వెనక్కి వెళ్లి కిటికీ నుంచి లోపలికి చూసేసరికి ఆయన ఉరి వేసుకుని వేలాడుతుండటాన్నిచూసి వెంటనే తలుపులు పగుల గొట్టి వెంటనే బసవతారకం ఆస్పత్రికి తరలించారనీ తెలిపారు వర్ల రామయ్య. 

నేను జీవించడం వృథా.. ఆత్మహత్య చేసుకోవడమే సరైంది అనే తరహాలో వైసీపీ సర్కార్... కోడెలను ఉసిగొల్సిందని ఆరోపించారు వర్ల రామయ్య. ఇక, కోడెల మృతికి ఈ ప్రభుత్వం సరైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కోడెల మృతికి సీఎం జగనే కారణమని ఆరోపించిన వర్ల.. మీరు బలవంత పెట్టారు.. ఆత్మహత్య చేసుకోమని ఉసిగొల్పారని వ్యాఖ్యానించారు. కోడెల ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికివాడు కాదు.. బలహీనుడు కాదు.. పోరాటపటిమ ఉన్న వ్యక్తి.. ఎందరికో ధైర్యాన్ని నూరిపోసిన ఆయనను ఆత్మహత్య చేసుకునేలా ఈ ప్రభుత్వమే ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు.