స్టైల్ మార్చిన తెలుగు తమ్ములు..!

స్టైల్ మార్చిన తెలుగు తమ్ములు..!

సిక్కోలు పసుపు దండు ట్రెండ్‌ మార్చిందా? ఇన్నాళ్లూ ఒక లెక్క ఇకపై మరో లెక్క అంటూ స్పీడ్‌ పెంచిందా? అధికారపార్టీకి తెలుగు తమ్ముళ్లు విసురుతున్న సవాళ్లు రాజకీయాన్ని హీటెక్కిస్తున్నాయా? ఇంతకీ శ్రీకాకుళం టీడీపీలో ఏం జరుగుతోంది?

అచ్చెన్న, కూన రవిలపై కేసులు!

వైసీపీ పవర్‌లోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ దూకుడికి  బ్రేకులు పడ్డాయి. టెక్కలి, ఇచ్ఛాపురంలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా మునుపటి ఊపు కనిపించ లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ నేతలు మౌనంగా ఉండిపోయారు. ఎమ్మెల్యే అయినప్పటికీ బెందాళం అశోక్‌ను ఇచ్ఛాపురంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరైనా గట్టిగా నోరెత్తితే పోలీస్‌ కేసు పెట్టే పరిస్థితి ఉంది. జిల్లా అగ్రనేత అచ్చెన్నాయుడు, కూన రవిలు  కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడ్డారు.

కూనకు పదవి ఇచ్చిన తర్వాత జోష్‌ వచ్చిందా?

ఇలాంటి తరుణంలో పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులను ప్రకటించారు చంద్రబాబు. శ్రీకాకుళానికి కూన రవికుమార్‌ను అధ్యక్షుడిని చేశారు. ఆయనకు అలా బాధ్యతలు అప్పగించారో లేదో ఇలా రంగంలోకి దిగిపోయారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన కామెంట్స్‌ను నిరసిస్తూ ఓ రేంజ్‌లో ఆందోళన చేపట్టి పార్టీ నేతల్లో జోష్‌ తీసుకొచ్చారనే కామెంట్స్‌ వినిపించాయి. జిల్లాలోని టీడీపీ నేతలను కలుపుకొని వెళ్లడం ప్లస్‌ అయిందని టాక్‌.

అచ్చెన్న, కూన జోడీపై కేడర్‌లో ఆశలు!

ఇప్పుడు జిల్లాకే చెందిన అచ్చెన్నాయుడికే రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో సిక్కోలు తమ్ముళ్లలో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోందట. ఇక కాచుకోండి అని అధికార పార్టీ నేతలకు తొడగొట్టి సవాల్‌ విసురుతున్నారట. అలాగే ఇంట  గెలిచి రచ్చ గెలవాలన్నట్టుగా జిల్లాపై అచ్చెన్న ఫోకస్‌ పెట్టడం కేడర్‌లో మరింత జోష్‌ తీసుకొచ్చిందని సమాచారం. అచ్చెన్న, కూన జోడిపై చాలా ఆశలు పెట్టుకున్నారట తమ్ముళ్లు. 

కేసులు పెడితే ఊరుకునేది లేదని ఎస్పీకి తేల్చి చెప్పారా?

ఇన్నాళ్లూ కిమ్మనకుండా ఉండిపోయిన నాయకులు సైతం శక్తిని కూడదీసుకుని పార్టీతోపాటు ప్రజల్లో కూడా మేము ఉన్నాం అనేలా జిల్లా సమస్యలపై ఫోకస్‌ పెట్టారట ఇద్దరు నాయకులు. కలిసి పోరాటం చేసే విషయంలో మొహమాటాలు దూరం పెట్టాలని హితవు పలికారట.  జిల్లా నాయకులను వెంట తీసుకుని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన అచ్చెన్న.. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి  తమ నేతలపై కేసులు పెడితే ఊరుకునేది లేదని ఎస్పీకి తెగేసి చెప్పి బయటకు వచ్చారట. 

జిల్లాలో టీడీపీ ట్రెండ్‌ మార్చిందా? 

ఇకపై నియోజకవర్గాల్లో ప్రొటోకాల్‌ పాటించకపోయినా.. పథకాల అమలులో ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఊరుకునేది లేదని టీడీపీ నేతలు తేల్చిచెప్పడంతో.. జిల్లాలో పార్టీ ట్రెండ్‌ మార్చిందనే  కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అని కూన రవికుమార్‌ కౌంటర్లు వేస్తున్నారు. మరి.. ఈ జోరు వచ్చే ఎన్నికల వరకూ ఉంటుందో లేదో చూడాలి.