27న జరగాల్సిన మహానాడు వాయిదా

27న జరగాల్సిన మహానాడు వాయిదా

ఈనెల 27న జరగాల్సిన మహానాడును వాయిదా వేస్తున్నట్లు కేబినెట్ భేటీలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో భేటీ అయిన మంత్రి వర్గం ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అంశాలతో పాటు మహానాడు నిర్వహణపై ప్రత్యేకంగా చర్చించారు. ఫలితాలు ఈ నెల 23న వెల్లడికానున్నందున 27న నిర్వహించాల్సిన మహానాడుకు సమయం సరిపోదని మంత్రులు ఈ సమావేశంలో ప్రతిపాదించారు. మంత్రుల ప్రతిపాదనను పరిశీలించిన సీఎం మహానాడును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్ని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశానికంటే ముందు సచివాలయంలోని ఒకటో బ్లాకులో సీఎం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి కేబినెట్‌ భేటీ కావడంతో పాటు ఫలితాల అనంతరం ఏర్పడే ప్రభుత్వంలో మరో కొత్త కేబినెట్‌ ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా విందు ఇచ్చారు.