ఏపీ సీఎంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించడం ఈ విషయాలపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌కు అనుభవం, అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ ను ఎవరూ ఊహించని రీతిలో చంద్రబాబు అభివృద్ధి చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చాకా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షమూ అంతే ముఖ్యమని అన్నారు. నాడు అన్ని పరిశీలించాకే చంద్రబాబు భవనాన్ని అద్దెకు తీసుకున్నారని.. ఆ భవనాన్ని 2007కు ముందే నిర్మించారన్న విషయాన్ని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. భవనంలో ఇతర నిర్మాణాలకు ఎన్‌వోసీ కూడా తీసుకున్నారని.. భవన యజమాని రూ.18 లక్షల నాలా పన్ను కూడా చెల్లించారన్నారు. గత ప్రభుత్వ పాలనపై ఎంక్వైరీ వేయడం దౌర్భాగ్యం అని.. సీఎం జగన్‌ ఎంత వేధించినా వెనక్కి తగ్గబోమని మాజీ మంత్రి చెప్పారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.

'చంద్రబాబు మీద వ్యక్తిగత కక్షతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాధిస్తున్నారు. విత్తనాలు లేక.. సాగునీరు లేక రైతులు పడుతోన్న ఇబ్బంది జగన్ సర్కారుకు పట్టదా..? చంద్రబాబుకు భద్రత తగ్గించారు. వైఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన భద్రత జోలికి రాలేదు. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు.. ప్రజలను కలిసేందుకు ప్రజా వేదిక అడిగాం. ప్రజా వేదికను కూలుస్తున్నారని భావించి ఉంటే ప్రజా వేదికను అడిగేవాళ్లమే కాదు. చంద్రబాబు ఇంటిని కూలదొస్తామని నోటీసులు ఇచ్చారు. ప్రజలు జరుగుతోన్న పరిణామాలు గమనించాలి. అనుమతుల్లేకుండా కట్టడాలు కట్టారంటూ నిర్మాణాలు కూల్చేస్తున్నారు. కష్టకాలంలో ఏపీకి వచ్చి.. ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్నాం. సీఆర్డీఏ ఈ భవనాన్ని తీసుకుంటే ప్రభుత్వ భవనంగా మారుతుందని భావించాం. సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చిందే 2015లో. ఈ భవనాన్ని గ్రామ పంచాయతీలో అనుమతి తీసుకునే నిర్మించారు. 2011లోనే ఈ భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. పంచాయతీ తీర్మానంతో భవనం నిర్మాణం చేశారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ఎన్ఓసీ ఇచ్చారు. వ్యవసాయ భూమిలో నిర్మాణం చేసుకున్నందుకు రూ. 18 లక్షల మేర నాలా పన్ను కట్టారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారమే చంద్రబాబు నివాసం ఉన్న ఇంటిని నిర్మించారు' అని అచ్చెన్నాయుడు అన్నారు.