తలసాని, తోట త్రిమూర్తులు భేటీ అందుకేనా..?

తలసాని, తోట త్రిమూర్తులు భేటీ అందుకేనా..?

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో ఏపీకి చెందిన కీలక నేత, టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రత్యేకంగా భేటీ కావడం హాట్‌టాపిక్ అయ్యాంది. తోట త్రిమూర్తులు మిత్రులు టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీలో చేరడంతో ఆయన కూడా అదే దారిలో వెళ్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తోట త్రిమూర్తులు.. తెలంగాణ మంత్రి తలసానితో భేటీ కావడం చర్చగా మారింది. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్‌లో తలసానితో తోట త్రిమూర్తులు భేటీ అయ్యారు. కొద్దిసేపు చర్చలు జరిపి వెళ్లిపోయారు. ఇక చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి ముందు త్రిమూర్తులుతో భేటీ కావడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరగగా.. ఇప్పుడు ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. రాజకీయాలకు అతీతంగా వీరిరువురి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇటీవల తోట త్రిమూర్తులు కుమారుడి వివాహ వేడుకకు తలసాని హాజరయ్యారు. రిసెప్షన్‌లో పాల్గొనేందుకు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్... ద్రాక్షారామం బయల్దేరినా... ట్రాఫిక్ జామ్‌లో దాదాపు 3 గంటల పాటు చిక్కుకుని చేరుకోలేకపోయారు. దీంతో బుధవారం హైదరాబాద్ వచ్చిన తోట త్రిమూర్తులు తలసానిని కలిశారని... రెండోసారి తెలంగాణ మంత్రి పదవి దక్కించుకున్న ఆయనకు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని సన్నిహితులు చెబుతున్నారు. మరి సార్వత్రిక ఎన్నికల ముందు ఏం జరుగుతుందో చూడాలి..!