టీడీపీకి షాక్‌..! మరో ఎమ్మెల్యే కూడా వైసీపీ గూటికి..!

టీడీపీకి షాక్‌..! మరో ఎమ్మెల్యే కూడా వైసీపీ గూటికి..!

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. పార్టీలో ఉన్న సీనియర్‌ నేతలు వైసీపీ గూటికి చేరుతూనే ఉన్నారు.. మరో వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకోకుండా.. ఆ పార్టీకి మద్దతిస్తున్నారు.. ఇప్పుడు ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన వాసుపల్లి గణేష్... ఇవాళ సీఎం జగన్‌తో భేటీ కాబోతున్నారు. అయితే... వైసీపీ కండువా వేసుకోకుండా... అనుబంధ సభ్యుడిగా కొనసాగే యోచనలో ఉన్నారు... గణేష్‌. ఆయన మనసు మార్చేందుకు అయ్యన్నపాత్రుడు చివరి ప్రయత్నం చేసినా... జగన్‌తో భేటీ అయ్యేందుకే గణేష్‌ నిర్ణయించుకున్నారు.

కొన్నాళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు వాసుపల్లి గణేష్‌ దూరంగా ఉంటున్నారు. వైసీపీ గూటికి చేరాలని నిర్ణయించుకోవడం వల్లే ఆయన పార్టీతో అంటీముట్టనట్లు ఉన్నారని విశాఖ టీడీపీలో చర్చ జరుగుతోంది. వైసీపీలో అధికారికంగా చేరకుండా ఆ పార్టీకి మద్దతిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి బాటలోనే... వాసుపల్లి గణేష్ కూడా వెళ్తారనే ప్రచారం సాగుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసినా... వైసీపీ కండువా కప్పుకోకుండానే గణేష్‌ ఆ పార్టీకి మద్దతిస్తారని సమాచారం.