ఎమ్మెల్సీ ఆశావాహుల్లో హై టెన్షన్

ఎమ్మెల్సీ ఆశావాహుల్లో హై టెన్షన్

టీడీపీ ఎమ్మెల్సీ ఆశావాహుల్లో హై టెన్షన్ నెలకొంది. రేపే నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఎవరికి టిక్కెట్ దక్కుతుందో తెలియక ఆందోళన పడుతున్నారు. ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీకి నాలుగు స్థానాలు దక్కుతుండగా, వైసీపీకి ఒక సీటు ఖాయం. ఇప్పటి వరకు సిఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించకపోవడంతో ఆశావాహుల్లో ఒకటే ఆందోళన.  నాలుగు స్థానాల్లో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆశోక్ బాబు పేర్లు ఫైనల్ అంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి ఆదినారాయణ రెడ్డి కుంటుంబ నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే టిక్కెట్ ఆశించే వారిలో నెల్లూరు మేయర్  అజీజ్, వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, పంచుమర్తి అనురాధ, బుట్టా రేణుక, గాదె వెంకట రెడ్డి, సబ్బం హరి, కోనేరు సురేష్ తదితరుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు.. అసంతృప్తులను బేరీజు వేసుకుంటూ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై  పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తారని తెలుస్తుంది. గవర్నర్ కోటాలో మరో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా పంపే అవకాశం ఉందని పార్టీ వర్గాల భోగట్టా. ఈ రాత్రికి చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై  కసరత్తు చేసి, రేపు ఉదయం కల్లా పేర్లు ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం.