'ఇది వైఎస్ జగన్ మరో కుట్ర..!'

'ఇది వైఎస్ జగన్ మరో కుట్ర..!'

హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డికి ఏ పార్టీతో గొడవలు లేవు... కేవలం వైఎస్ జగన్‌తోనే వివేకాకు గొడవలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వివేక మృతిపై స్పందిస్తూ... వైఎస్ జగన్ మరో కుట్రకు తెరలేపారని విమర్శించారు. వైఎస్ వివేకానంద మృతదేహం రక్తపు మడుగులో ఉంటే.. ఆ ఆనవాళ్లు తుడిచేశారని ఆరోపించిన ఆయన.. గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేశారు? అని ప్రశ్నించారు. సొంత బాబాయ్ చనిపోతే లోటస్‌పాండ్‌లోనే ఉంటూ జగన్ ఎందుకు స్పందించ లేదు? వివేకా కుటుంబానికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య తర్వాత ప్రభుత్వం సిట్ వేస్తే.. జగన్ తెలంగాణ పోలీసులతో మంతనాలు వాస్తవం కాదా..? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. వివేకా హత్య కేసుని ఏపీ పోలీసులతో కాకుండా తన జేబు సంస్ధ అయిన సీబీఐతో విచారణ చేయించాలని అనుకోవడం నిజం కాదా..? అంటూ ఎదురుదాడికి దిగారు. మరోవైపు ఈ హత్య కూడా పీకే సూచనలతోనే జరిగిందనే అనుమానాలు ఉన్నాయన్నారు వెంకన్న.. జగన్ ప్రజాధనాన్ని లూటీ చేస్తారనే అనుకున్నాం తప్ప.. సొంత బాబాయినే రాజకీయం కోసం హత్య చేస్తారని ఎవరూ ఊహించ లేదని సంచలన ఆరోపణలు చేశారు. రెండు రోజుల క్రితమే వివేకా లోటస్‌పాండ్ నుంచి కన్నీళ్లతో బయటకు వచ్చి కారెక్కి వెళ్లిపోవడం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.