సైబరాబాద్ సీపీపై పయ్యావుల ఫైర్..

సైబరాబాద్ సీపీపై పయ్యావుల ఫైర్..

డేటా చోరీ వ్యవహారం మరింత ముదిరి పాకానపడుతోంది. ఈ వ్యవహారంలో సైబరాబాద్ కమిషనరుపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ డేటా దొంగతనానికి గురైందన్నారు. అమరావతిలోనే ఈ కుట్రకు తెర లేపారని ఆరోపించిన ఆయన.. గత నెల 23వ తేదీనే తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్ధలోకి వెళ్లారు.. అశోక్ సహా పలువురు కీలక ఉద్యోగులను ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో విచారించారని.. మఫ్టీలో తెలంగాణ పోలీసులు చేసిన విచారణ దొంగతనం కిందే లెక్క అన్నారు. ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా.. ఉద్యోగులను బెదిరించి సమాచారం సేకరించింది నిజం కాదా..? అని ప్రశ్నించిన పయ్యావుల.. టీడీపీ డేటా దొంగతనం సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు తెలిసి జరిగిందా..? తెలియకుండా జరిగిందా..?, సైబరాబాద్ సీపీ కుట్రలో భాగస్వామా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సైబరాబాద్ కమిషనర్ కనుసన్నల్లోనే అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించిన పయ్యావుల... రెండో తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. మూడో తేదీ నాటికి అశోక్ పరారయ్యారని ఎలా ప్రకటిస్తారాన మండిపడ్డారు. గత నెల 23వ తేదీనే ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు చేశామని చెప్పగలిగే దమ్ము సైబరాబాద్ కమిషనరుకు ఉందా..? అంటూ సవాల్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ... తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులొత్తకుండా సజ్జనార్ ఐపీఎస్ అధికారిగా వ్యవహరించాలని సూచించారు.