భద్రాచలం మాకిచ్చేయండి..!

భద్రాచలం మాకిచ్చేయండి..!

ఆంధ్ర ప్రజలపై వివిధ సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌.. విజయవాడలోని బెంజ్ సర్కిల్‌కు వచ్చి తన ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్‌కు ఈ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్ ప్రత్యేక హోదాపై ప్రకటన చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేసిన ఆయన.. ప్రత్యేక హోదా విషయంలో అవిశ్వాసం పెడితే టీఆర్ఎస్ సహకరించలేదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా కేసీఆర్, హరీష్ రావు మాట్లాడారన్న రాజేంద్రప్రసాద్... కేసీఆర్‌కు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. 

భద్రాచలం మాకిచ్చేయండి.. మా రాముడ్ని మేం చూసుకుంటాం... భద్రాచలం ముంపు గ్రామాలను ఎలా సంరక్షించుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్... భద్రాచలాన్ని ఏపీలో కలిపే అంశంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న ఆయన... అవసరమైతే భద్రాచలాన్ని ఏపీలో కలపాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం, ఎంపీ కవిత వేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు టీడీపీ ఎమ్మెల్సీ... తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ చెరో వేయి కోట్ల రూపాయల సొమ్మును జగన్‌కు పంపారని ఆరోపించారు. మరోవైపు తెలంగాణ ప్రజలతో మాకెటువంటి పంచాయతీ లేదు.. పోకిరి కేసీఆర్‌తోనే మాకు పంచాయతీ అన్నారు రాజేంద్రప్రసాద్.