మండలి ఛైర్మన్‌గా షరీఫ్...

మండలి ఛైర్మన్‌గా షరీఫ్...

ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. ఆదివారం ఉదయం 11.45 నిమిషాలకు ముహూర్తం ఖరారు అయింది. కేబినెట్ విస్తరణ నేపధ్యంలో సీఎం చంద్రబాబు ఖాళీగా ఉన్న పదవుల్లో మైనార్టీలకు పెద్ద పీట వేశారు. మంత్రి వర్గంలో ఛాన్స్ రావడంతో మండలి ఛైరన్మన్ పదవికి ఫరూఖ్‌ రాజీనామా చేశారు. ఈ పదవిని మళ్లీ మైనార్టీలకే సీఎం కేటాయించారు. ఎమ్మెల్సీ మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌కు మండలి ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. షరీఫ్‌ను శాననమండలి ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించడంతో జిల్లాతో పాటు ఆయన స్వస్థలం నరసాపురంలో సంబరాలు  మొదలయ్యాయి. షరీఫ్‌ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ.. మంచి గుర్తింపు పొందారు. అప్పుడు ఎన్టీఆర్‌కు.. ఇప్పుడు చంద్రబాబుకు మంచి ఆప్తుడిగా పేరు సంపాదించారు.

1982లో మొదటగా మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ నరసాపురం టీడీపీ పట్టణ అధ్యక్షునిగా మూడు సంవత్సరాలు పని చేశారు. అతనిని గుర్తించిన టీడీపీ అధిష్ఠానం 1985 నుంచి 1987 వరకూ జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా నియమించింది. అనంతరం విజయనగరం,  వరంగల్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ జిల్లాలకు పార్టీ పరిశీలకునిగా పనిచేశారు. 1987లో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌గా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 1990 నుంచి 1997 వరకూ నరసాపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997 నుంచి 2000 వరకూ మళ్లీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేస్తూ.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా కూడా ఉన్నారు. 2000లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

2002లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2004 నుంచి 2009 వరకూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి 2011 వరకూ రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ.. నిజామాబాద్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల పరిశీలకునిగా ఉన్నారు. ఇక 2015లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. 2017లో శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు, మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు.